Shehbaz Sharif: 75 ఏళ్లుగా బిచ్చగాళ్లలా అడుక్కుంటున్నాం.. పాక్‌ ప్రధాని ఆవేదన

మన కంటే చిన్న దేశాలు ఆర్థిక రంగంలో మనల్ని దాటిపోయాయి. మన పరిస్థితే దారుణంగా తయారైంది. 75 ఏళ్లుగా చిప్ప పట్టుకుని సంచారం చేస్తూ అడుక్కుంటున్నాం. మిత్ర దేశాలు మనల్ని బిచ్చగాళ్లలా చూస్తున్నాయి. ఫోన్ చేసినా కూడా డబ్బుల కోసమే అనుకుంటున్నారు. ఇతర దేశాల పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఇలాగే భావిస్తున్నారు

Shehbaz Sharif: 75 ఏళ్లుగా బిచ్చగాళ్లలా అడుక్కుంటున్నాం.. పాక్‌ ప్రధాని ఆవేదన

Even friendly countries think we are beggars says Pakistan PM Shehbaz Sharif

Updated On : September 16, 2022 / 8:49 AM IST

Shehbaz Sharif: తమ కంటే చిన్న చిన్న దేశాలు ఆర్థిక రంగంలో తమను దాటిపోతున్నాయని, అయితే తాము మాత్రం 75 ఏళ్లుగా చిప్ప పట్టుకుని అడుక్కుంటున్నట్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుదవారం ఆయన ఇస్లామాబాద్‭లో జరిగిన న్యాయశాస్త్ర విద్యార్థుల స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ దేశ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే.. మిత్ర దేశాల్లో పర్యటించినప్పుడు డబ్బుల కోసమే వెళ్లామని అనుకుంటున్నారని, ఆఖరికి ఫోన్ చేసినా కూడా డబ్బుల కోసమే అనుకుంటున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘‘నేను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే నాటికే ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా మారింది. దీనికి తోడు జూన్‭లో వచ్చిన వరదలు మూడో వంతు పాకిస్తాన్‭ను ముంచెత్తాయి. 1400 మంది చనిపోగా, దేశంలోని ప్రతి ఏడుగురిలో ఒకరు తీవ్ర ప్రభావానికి గురయ్యారు. 95 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. 78 వేల చదరపు కిలోమీటర్ల మేర పంటలుమునిగిపోయాయి. ఓ వైపు కనీసం 32 వేల కోట్ల రూపాయలైనా అప్పుదొరుకుతుందేమోనని ఇంటర్నేషనల్‌ మోనిటర్‌ ఫండ్ వద్ద ప్రయత్నాలు చేస్తుంటే.. అకాల వర్షాలు, వరదలతో ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్తవ్యస్థమైపోయింది’’ అని షెహబాజ్ అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మన కంటే చిన్న దేశాలు ఆర్థిక రంగంలో మనల్ని దాటిపోయాయి. మన పరిస్థితే దారుణంగా తయారైంది. 75 ఏళ్లుగా చిప్ప పట్టుకుని సంచారం చేస్తూ అడుక్కుంటున్నాం. మిత్ర దేశాలు మనల్ని బిచ్చగాళ్లలా చూస్తున్నాయి. ఫోన్ చేసినా కూడా డబ్బుల కోసమే అనుకుంటున్నారు. ఇతర దేశాల పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఇలాగే భావిస్తున్నారు. వారంతా భిక్షం అడుగుతామేమో అనే భావనలో ఉన్నారు. నిజంగానే పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Ghulam Nabi Azad Gets Threat: జమ్మూకశ్మీర్‌లో ర్యాలీలకు సిద్ధమవుతున్న గులాం నబీ ఆజాద్‌కు పాక్ ఉగ్రవాద సంస్థ వార్నింగ్