Pakistan nukes: పాక్‌లో మరిన్ని విధ్వంసకర అణు బాంబులు.. ఉపగ్రహ చిత్రాల ద్వారా సంచలన నిజాలు
ఆయా ప్రాంతాల్లో పాక్ న్యూక్లియర్ కార్యకలాపాలకు సంబంధించిన కొత్త లాంఛర్లు, కేంద్రాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేశారు.

Pakistan nuclear weapons, 2023
Pakistan nukes – satellite images: పాకిస్థాన్.. ప్రపంచంలోని పేదరిక దేశాల్లో ఒకటి. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎలా తేలి ఒడ్డుకు చేరుకోవాలో కూడా తెలియక సతమతమవుతున్న దేశం అది. దేశంలోని పేదలకు తిండి పెట్టే స్తోమతా లేదు. అయినప్పటికీ భారత్ మీద అక్కసుతో కోట్లాది రూపాయలు సమకూర్చుకుని అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకుంటోంది.
భారత్ బాంబులు తయారు చేసుకుంటుందని, తామూ అదే పని చేస్తామని ప్రకటన చేసి మరీ అప్పట్లో అణ్వస్త్ర చర్యలను ప్రారంభించిన పాక్.. ఇప్పుడు కూడా ఆ పనిని కొనసాగిస్తూనే ఉంది. చైనా సాయం లేనిదే పాకిస్థాన్ లో బాంబులు తయారయ్యేవి కాదని న్యూక్లియర్ ఆయుధాల నిపుణుడు గ్యారీ మిల్హోలిన్ అన్నారు. పాక్ వద్ద అంత సాంకేతికత కూడా ఉండకపోయేది.
కొత్తగా ఏం తెలిసింది?
పాకిస్థాన్ 165 అణ్వస్త్రాలను అభివృద్ధి చేసుకుంది. ఇప్పటివరకు ప్రపంచానికి ఇంతవరకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఉపగ్రహ చిత్రాల ద్వారా మరికొన్ని విషయాలు వెల్లడయ్యాయి. బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్ లో సెప్టెంబరు 11న నిపుణులు ఓ నివేదికను ప్రచురించారు.
‘2023 పాకిస్థాన్ న్యూక్లియర్ హ్యాండ్‌బుక్’ పేరిట బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్ లో ఈ నివేదిక ఉంది. దాని ప్రకారం.. పాకిస్థాన్‌లో అణ్వస్త్రాల సంఖ్య 170 పెరిగింది. పాకిస్థాన్ అణ్వాయుధాల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటోందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
పాక్ వ్యూహాత్మక అణు ఆయుధాగారంలోని వార్‌హెడ్స్, డెలివరీ సిస్టమ్స్ పెరుగుతూనే ఉన్నాయి. అణ్వస్త్రాలకు కావాల్సిన మెటీరియల్ ఉత్పత్తి కూడా క్రమంగా పెరుగుతోంది. అంటే శుద్ధి చేసిన యురేనియంతో పాటు ప్లుటోనియం వంటి ఫిసిల్ మెటీరియల్ ను ఉత్పత్తి చేసే పరిశ్రమ చురుకుగా ఉంది. పాక్ ఫిసిల్ మెటీరియల్ ను ఉత్పత్తి చేసి నిల్వలు కూడా చేసుకుంటోంది. ఇతర దేశాల్లో వీటిని నిల్వలు చేసుకునే విధానం లేదు.
పాక్ ఆర్మీ, వాయుసేన స్థావరాల్లో..
పాక్ ఆర్మీ, వాయుసేన స్థావరాల్లోని పరిస్థితులు, నిర్మాణాల గురించి నిపుణులు ఉపగ్రహ చిత్రాల ద్వారా అధ్యయనం చేశారు. ఆయా ప్రాంతాల్లో పాక్ న్యూక్లియర్ చర్యలకు సంబంధించిన కొత్త లాంఛర్లు, కేంద్రాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేశారు. గగనతలం నుంచి దాడి చేసే అణ్వస్త్రాలు 36 ఉండగా, భూతలం నుంచి దాడి చేసే అణ్వస్త్రాలు 126 ఉన్నాయి.
మరో ఎనిమిది అణ్వస్త్రాలనూ పాక్ నిల్వ చేసుకుంది. ప్రతి ఏటా కొత్తగా 14-27 న్యూక్లియర్ వార్హెడ్లను అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ ను పాక్ ఉత్పత్తి చేస్తోంది. పాకిస్థాన్‌లో 2020 నాటికి 60-80 అణ్వస్త్రాలు ఉంటాయని అమెరికా రక్షణ శాఖ నిఘా ఏజెన్సీ 1999లో అంచనా వేసింది.
అమెరికా అంచనా వేసిన దాని కంటే రెండు రెట్లకు పైగానే పాక్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకుంది. అయితే, న్యూక్లియర్ సామర్థ్యం ఉన్న లాంఛర్లు మాత్రం పాక్ లో తక్కువగా ఉన్నాయి. లాంఛర్లలో తక్కువ శ్రేణి సిస్టమ్స్, అణ్వస్త్ర మిషన్లకే కాక ఇతర మిషన్లకు వాడేవి ఉన్నాయి.
United Kingdom : అక్కడ కోట్ల విలువైన ప్లాట్లు రూ.100 కే అమ్మేశారు..ఎక్కడంటే?