Gold worth $6 billion discovered టర్కీ ఫెర్టిలైజర్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ గుబెర్టాస్ కి భారీ బంగారు నిధి దొరికింది. అప్పుడప్పుడు, అక్కడక్కడ అనుకోకుండా బంగారు నిధులు బయపడుతుంటాయి. కానీ ఇది అలాంటి ఇలాంటి బంగారు నిధి కాదు… ఈ బంగారు నిధి విలువ అనేక దేశాల జిడిపి కంటే ఎక్కువ విలువైంది. టర్కీలోని సోగుట్ సెంట్రల్ వెస్ట్ ప్రాంతంలో..టర్కీ దేశపు వ్యవసాయ క్రెడిట్ కోఆపరేటివ్స్ , గుబ్రేటాస్ ఎరువుల ఉత్పత్తి సంస్థ చీఫ్ ఫహ్రెటిన్ పోయరాజ్ 99 టన్నుల బంగారపు నిధిని గుర్తించారు.
ఈ నిధి విలువ 6 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే భారత కరెన్సీలో రూ.44,000 కోట్లు. ఈ బంగారు నిధి మొత్తం ప్రపంచంలోనే ఎన్నో దేశాల జీడీపీ కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. వరల్డ్‌మీటర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మాల్దీవుల జిడిపి 4.87 బిలియన్ డాలర్లు, లిబేరియా జీడీపీ 3.29 బిలియన్ డాలర్లు, భూటాన్ 2.53 బిలియన్ డాలర్లు, బురుండి 3.17 బిలియన్ డాలర్లు, లెసోతో 2.58 బిలియన్ డాలర్లు. అంటే ఈ దేశాల జీడీపీ కంటే టర్కీలో బయటపడి బంగారం నిధి విలువ ఎక్కువ. మౌరిటానియా, మోంటెనెగ్రో, బార్బడోస్, గయానా, ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా టర్కీ బంగారు నిధి కంటే చిన్నవే.
అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇంత భారీ నిధి టర్కీలో బయటపడటం విశేషం. రాబోయే రెండేళ్లలో ఈ బంగారం తవ్వడం లేదా మైనింగ్ ప్రారంభం అవుతుందని…ఇది టర్కీ ఆర్థిక వ్యవస్థకు ఎంతో సహాయపడుతుందని పోయరాజ్ తెలిపారు. బంగారపు నిధి వార్తలు బయటకి రావడంతో గుబెర్టాస్ కంపెనీ షేర్ల ధరలు 10శాతం పెరిగాయి.
కాగా, ఈ ఏడాది టర్కీ… 38 టన్నుల బంగారం ఉత్పత్తి చేసి రికార్డు సాధించింది. రాబోయే 5ఏళ్లలో దాన్ని 100 టన్నులకు పెంచడమే తమ లక్ష్యమని సెప్టెంబరులో ఇంధన సహజ వనరుల మంత్రి ఫాతిహ్ డోన్మెజ్ తెలిపారు. తాజాగా బంగారం నిధి బయటపడడంతో ఆ అంచనాలను అందుకోవడం టర్కీకి పెద్ద కష్టమేమీ కాదు..