imran murder : హత్యకు కుట్ర అంటూ ఆరోపణలు..ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్ బెడ్‌రూమ్‌లో నిఘా కెమెరాలు అమర్చేందుకు ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని భద్రతాసిబ్బంది ఆరోపిస్తున్నారు. తన హత్యకు కుట్ర జరుగుతోందని ఇమ్రాన్ ఆరోపిస్తున్న తరుణంలో ఆయన ఇంట్లోని సిబ్బంది ఇలా దొరికిపోవడం సంచలనంగా మారింది.

Man Arrested For Spying From Imran Khan's Residence
Man arrested for spying from Imran Khan’s residence : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్ బెడ్‌రూమ్‌లో నిఘా కెమెరాలు అమర్చేందుకు ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని భద్రతాసిబ్బంది ఆరోపిస్తున్నారు. తన హత్యకు కుట్ర జరుగుతోందని ఇమ్రాన్ ఆరోపిస్తున్న తరుణంలో ఆయన ఇంట్లోని సిబ్బంది ఇలా దొరికిపోవడం సంచలనంగా మారింది.
తనపై అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న ప్రధాన ఆరోపణ..తన హత్యకు కుట్ర జరుగుతోందని. పాకిస్తాన్‌లో అధికార మార్పిడి వెనక విదేశాల హస్తం ఉందని ఆరోపిస్తున్న ఆయన..కొన్ని శక్తులు తనను చంపేందుకు చూస్తున్నాయని బహిరంగ సభల్లో పదే పదే ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలోనే ఆయన ఇంట్లో పనిచేసే సిబ్బంది ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. బనిగలలోని ఇమ్రాన్ నివాసంలో నిఘా కెమెరాలు పెట్టేందుకు ఆ వ్యక్తి డబ్బులు తీసుకున్నాడని ఏఆర్‌వై న్యూస్ తెలిపింది. ఆ వ్యక్తి వాలకం గమనించిన భద్రతా సిబ్బంది అతన్ని నిర్బంధించి పోలీసులకు సమాచారం అందించారని వెల్లడించింది.
అటు ఈ ఘటనతో ఇమ్రాన్ నివాసం దగ్గర భారీగా భద్రతాబలగాలను మోహరించారు. ఇమ్రాన్ గదులను శుభ్రపరిచే సిబ్బంది నిఘా కెమెరా అమర్చేందుకు ప్రయత్నించారని, ఇది అత్యంత దురదృష్టకరమని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ కు చెందిన నేత తెలిపారు. ఆ సిబ్బంది నుంచి మరింత సమాచారం సేకరించామని, వాటిని వెల్లడించలేమని ఆయన అన్నారు.
అవిశాస్వతీర్మానంతో పదవి దిగిపోయిన తొలి ప్రధానిగా చరిత్రకెక్కిన ఇమ్రాన్ ఖాన్….పాకిస్తాన్‌లో తక్షణమే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు నెలలుగా ఆయన నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. కరాచీ, ఇస్లామాబాద్ సహా అనేక ప్రాంతాల్లో భారీ సభలు నిర్వహిస్తున్నారు.
రష్యా యుక్రెయిన్ యుద్ధంలో స్వతంత్ర వైఖరి అవలంబించడంతో తనపై అమెరికా పగబట్టిందని, ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం వెనక అగ్రరాజ్యం హస్తం ఉందని ఆయన పలుమార్లు ఆరోపించారు. యుద్దం విషయంలో స్వతంత్ర వైఖరి అవలంబించినప్పటికీ..భారత్‌ను అమెరికా ఏం చేయలేదని, కానీ పాకిస్తాన్‌లో మాత్రం అధికారమార్పిడి చేసిందని ఇమ్రాన్ అంటున్నారు.
భారత విదేశాంగ విధానం చూసి పాకిస్తాన్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని కూడా అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం రాలేదని, వారి స్వాతంత్ర్యం కోసం తాను పోరాడతానని ఇమ్రాన్ చెబుతున్నారు. పదవి దిగిపోయిన దగ్గరనుంచి ఇమ్రాన్‌ను అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. ఒక దశలో ఆయన్ను అరెస్టు చేస్తారన్న ప్రచారమూ జరిగింది. అయితే ఇమ్రాన్ మాత్రం ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు జరిగే వరకూ పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు.