వామ్మో.. ఈఫిల్ టవర్ అంతటి పెద్ద గ్రహశకలం వస్తుంది.. 2029 ఏప్రిల్ 13 శుక్రవారం రోజున ఏం జరగనుంది?
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అపోఫిస్‌ను అధ్యయనం చేయడానికి ఓ ముఖ్యమైన మిషన్‌ను సిద్ధం చేసుకుంటోంది.

Asteroid
ఆస్టరాయిడ్ అపోఫిస్.. కొన్నేళ్లుగా ఈ గ్రహశకలంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తూనే ఉన్నారు. భూమికి అపోఫిస్ నుంచి ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని చెబుతూనే ఉన్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అపోఫిస్‌ను అధ్యయనం చేయడానికి ఓ ముఖ్యమైన మిషన్‌ను సిద్ధం చేసుకుంటోంది.
ఆ గ్రహశకలం 2029 ఏప్రిల్ 13 (శుక్రవారం)న భూమికి దగ్గరగా చేరుకుంటుంది. దీంతో ఆ ఏడాది ఏప్రిల్ 13 శుక్రవారం రోజున ఏం జరగనుందన్న భయం చాలా మందిలో ఉంది. రాపిడ్ అపోఫిస్ మిషన్ ఫర్ స్పేస్ సేఫ్టీ-రామ్‌సెస్ అని ఈ మిషన్‌కు పేరుపెట్టారు. అపోఫిస్ గ్రహశకలానికి సంబంధించిన డేటాను సేకరించాలంటే ఈ మిషన్ 2028 మొదటి నెలల్లోనే ప్రారంభం కావాల్సి ఉంటుంది.
2027 వరకు శాస్త్రవేత్తలు గుర్తించలేరు
భూమికి దగ్గరగా వచ్చే ఈ గ్రహశకలం ఏ దిశలో వెళ్తుందన్న విషయాన్ని 2027 వరకు శాస్త్రవేత్తలు గుర్తించలేరు. ఈ గ్రహశకలాన్ని అధ్యయనం చేస్తే భవిష్యత్తులో (2029 తర్వాత) భూమి మీదుగా వచ్చే గ్రహశకలాల గురించి, వాటి ప్రభావం గురించి కూడా అంచనా వేసేందుకు మార్గం సుమగం అవుతుంది.
అపోఫిస్ గ్రహశకలం భూమిని ఢీ కొట్టే ముప్పు చాలా తక్కువగా ఉంటుంది. ఈ మిషన్ ద్వారా శాస్త్రవేత్తలు అపోఫిస్ కూర్పు, నిర్మాణం, భూమికి సమీపంగా ప్రయాణించే సమయంలో దాని ప్రభావం మీద భూమి మీద పడే తీరును పరిశోధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మొట్టమొదటి సారిగా 2004లో గుర్తించిన శాస్త్రవేత్తలు
అపోఫిస్ గ్రహశకలం వేరుశెనగ ఆకారంలో ఉంటుంది. ఇది దాదాపుగా 1,230 అడుగుల (375 మీటర్లు) వ్యాసం కలిగి ఉంటుంది. అంటే పరిమాణంలో ఇది ఈఫిల్ టవర్ అంత ఉంటుంది. ఈ ప్రమాదకర గ్రహశకలాన్ని మొట్టమొదటి సారిగా 2004లో గుర్తించారు. ఈ గ్రహశకలానికి ఈజిప్షియన్ సర్ప దేవుడు అపెప్ పేరు మీదుగా అపోఫిస్‌గా పేరు పెట్టారు.
అలాగే, “గాడ్ ఆఫ్ ఖోస్” అనే మరోపేరు ఉంది. ఈ అపోఫిస్ భూమికి 20,000 మైళ్ల (32,000 కిలో మీటర్లు) కంటే తక్కువ దూరం నుంచి వెళ్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ సమయంలో భూ కక్ష్యలో ఉన్న కొన్ని ఉపగ్రహాలు కూడా దీని వల్ల ప్రభావితం కావచ్చు.