Gaza
Israel: ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తుండడంతో గాజా ప్రజలు గజగజా వణికిపోతున్నారు. గాజాలో ఉన్న ఒకే ఒక్క పవర్ ప్లాంట్లో ఇప్పుడు ఇంధనం అయిపోవడంతో పని చేయట్లేదు. విద్యుత్తు లేక గాజా ప్రజలు చీకటిలో మగ్గుతున్నారు. అంతేకాదు, వైద్య సౌకర్యాలు సరిగ్గా అందడం లేదు.
ఆహార సరఫరా అంతంత మాత్రంగానే జరుగుతోంది. గత రాత్రి గాజాలోని ఓ ప్రాంతంలో యుద్ధ విమానాలతో దాడులు చేయడంతో ప్రజలు తమ అపార్ట్‌మెంట్ల నుంచి భయంతో కట్టుబట్టలతో బయటకు పరుగులు తీయాల్సి వచ్చింది. ఆ సమయంలో చిన్నపిల్లలు, మహిళలు భయంతో కేకలు వేసిన తీరు గురించి వింటుంటే హృదయం ద్రవించిపోతుంది. గాజా నుంచి ఇతర ప్రాంతానికి వెళ్లే దిక్కులేక, సొంత ప్రాంతంలో ఉండలేక అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.
ఓ మహిళ తమకు ఎదురైన అనుభవాన్ని మీడియాకు తెలిపింది. తమ పొరుగింటి వ్యక్తి వచ్చి తలుపులు కొట్టాడని, వెంటనే ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఇక్కడ దాడులు జరుగుతున్నాయని చెప్పాడని పేర్కొంది. తన ముగ్గురు పిల్లలను నిద్ర నుంచి లేపానని, ఎమర్జెన్సీ కిట్ పట్టుకుని ఆసుపత్రి, శిబిరాల వైపు పరిగెత్తామని తెలిపింది.
అయితే, రోడ్డు మీదకు వచ్చి చూస్తే వందలాది మంది కనపడ్డారని, వారు కూడా షెల్టర్ కోసం చూస్తున్నారని చెప్పింది. అర్ధరాత్రి తలలపై నుంచే రాకెట్లు వెళ్లాయని, పిల్లలు భయంతో వణికిపోయారని తెలిపింది. గాజాలోని 80 శాతం మంది ప్రజలు దాతలు అందించే ఆహారంపైనే ఆధారపడి బతుకుతున్నారు. గాయాలపాలైన వారికి కనీసం చికిత్స అందడం లేదు. అందులో పిల్లలు 30-40 శాతం మంది ఉన్నారు.