Global Citizenship Rules: ప్రపంచ దేశాల పౌరసత్వ నిబంధనలు.. ఈ దేశాలు తమ జాతీయతను ఎలా నిర్ధారిస్తాయో తెలుసా?
ఒక దేశంలో నివసించే వ్యక్తి ఆ దేశ అధికారిక పౌరుడే అని నిరూపించుకోవడానికి వివిధ రకాల చట్టపరమైన పత్రాలు(Global Citizenship Rules) అవసరమవుతాయి.
Global Citizenship Rules_ Do you know how these major countries determine nationality_
-
పాస్‌పోర్ట్ ఉంటేనే పౌరసత్వం కాదు.
-
కొన్ని దేశాల్లో సర్టిఫికెట్లు తప్పనిసరి.
-
జపాన్‌లో కుటుంబ రికార్డే ముఖ్యం.
Global Citizenship Rules: ఒక దేశంలో నివసించే వ్యక్తి ఆ దేశ అధికారిక పౌరుడే అని నిరూపించుకోవడానికి వివిధ రకాల చట్టపరమైన పత్రాలు అవసరమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు తమ పౌరుల జాతీయతను (Global Citizenship Rules) ధృవీకరించడానికి వేర్వేరు పద్ధతులను, చారిత్రక రికార్డులను, సాంకేతికతను ఉపయోగిస్తాయి. కొన్ని దేశాలలో కేవలం అంతర్జాతీయ పాస్‌పోర్ట్ పౌరసత్వానికి పూర్తి నిరూపణగా సరిపోతుండగా, మరికొన్ని దేశాలలో పుట్టుక ఆధారిత ధృవీకరణ పత్రాలు, శతాబ్దాల నాటి కుటుంబ రికార్డులు లేదా అత్యాధునిక డిజిటల్ జాతీయ గుర్తింపు కార్డులు అవసరమవుతాయి. కాబట్టి, ప్రస్తుతం ఏ ఏ దేశంలో పౌరసత్వ నిర్ధారణ ప్రక్రియ ఎలా ఉంటుందో ఇక్కడ సవివరంగా తెలుసుకుందాం.
పాస్‌పోర్ట్, ప్రత్యేక పత్రాలు ఆధారిత దేశాలు:
అమెరికా: అమెరికా సంయుక్త రాష్ట్రాలలో (USA) చెల్లుబాటులో ఉన్న యూఎస్ పాస్‌పోర్ట్ పౌరసత్వానికి అత్యున్నత, పూర్తి, స్వతంత్ర సాక్ష్యంగా పనిచేస్తుంది. ఫెడరల్ చట్టాల ప్రకారం దీనికి అక్కడ ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనితో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన బర్త్ సర్టిఫికేట్, నేచురలైజేషన్ సర్టిఫికేట్ కూడా పౌరసత్వ నిరూపణకు ఉపయోగిస్తారు.
యునైటెడ్ కింగ్డమ్: బ్రిటన్‌లో పౌరసత్వ నియమాలు ఒక వ్యక్తి పుట్టిన సంవత్సరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. 1983 జనవరి 1 కి ముందు బ్రిటన్‌లో పుట్టిన వారికి కేవలం వారి బర్త్ సర్టిఫికేట్ పౌరసత్వానికి సరిపోతుంది. కానీ, ఆ తర్వాత పుట్టిన వారు మాత్రం తమ తల్లిదండ్రుల బ్రిటిష్ పౌరసత్వం లేదా ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌కు సంబంధించిన రికార్డులను కూడా అదనంగా చూపించాల్సి ఉంటుంది.
కెనడా & ఆస్ట్రేలియా: ఈ రెండు కామన్వెల్త్ దేశాలలో కేవలం పాస్‌పోర్ట్ లేదా బర్త్ సర్టిఫికేట్ మాత్రమే పౌరసత్వానికి పూర్తి ఆధారం చెప్పలేం. కెనడా ప్రభుత్వం పౌరసత్వ నిరూపణకు అత్యున్నత పత్రంగా డిజిటల్ లేదా ఫిజికల్ రూపంలో ఉండే ‘సిటిజన్‌షిప్ సర్టిఫికేట్’ ఇస్తుంది. ఆస్ట్రేలియాలో కూడా తల్లిదండ్రుల వీసా స్టేటస్‌ను బట్టి పౌరసత్వం మారుతుంది కాబట్టి, అక్కడ ‘ఎవిడెన్స్ ఆఫ్ ఆస్ట్రేలియన్ సిటిజన్‌షిప్ సర్టిఫికేట్’ అత్యంత కీలకంగా మారింది.
ఐడెంటిటీ కార్డులు, ప్రత్యేక రిజిస్టర్ల విధానం:
రష్యా: ఇక్కడ ‘డ్యూయల్ పాస్‌పోర్ట్’ అనే విధానం అమల్లో ఉంటుంది. అంతర్జాతీయ ప్రయాణాలకు విదేశీ పాస్‌పోర్ట్ వాడినప్పటికీ, దేశీయంగా పౌరసత్వ నిరూపణకు, నివాస ధృవీకరణ అవసరం అవుతుంది. అలాగే, సైనిక విధులకు 14 ఏళ్ల వయసులో జారీ చేసే ‘ఇంటర్నల్ రష్యన్ పాస్‌పోర్ట్’ కూడా ఇక్కడ అత్యంత తప్పనిసరి.
జపాన్: జపాన్‌లో శతాబ్దాలుగా వస్తున్న ‘కోసెక్’ (Koseki) అనే కుటుంబ నమోదు వ్యవస్థ అధికారిక పౌరసత్వానికి మూలస్తంభంగా ఉంది. ఇది ఒక పౌరుడి పుట్టుక, వివాహం, మరణం, వంశావళిని పూర్తి చట్టబద్ధంగా ధృవీకరిస్తుంది.
యూరోపియన్ దేశాలు: ఇక ఐరోపా సమాఖ్యలోని వివిధ దేశాలు కూడా వేర్వేరు పద్ధతులను పాటిస్తున్నాయి. స్పెయిన్‌లో పౌరసత్వానికి, గుర్తింపునకు ‘డిఎన్ఐ’ (DNI) కార్డ్ ఆధారంగా పనిచేస్తుంది. ఇటలీలో మున్సిపల్ రికార్డులతో అనుసంధానించబడిన ‘ఎలక్ట్రానిక్ ఐడెంటిటీ కార్డ్’ (CIE) ను వాడుతున్నారు. జర్మనీలో ‘స్టాట్సంగెహోరిగ్కీట్సాస్వీస్’ (Certificate of Nationality), ఫ్రాన్స్‌లో ‘సిఎన్ఎఫ్’ (CNF) అనే ప్రత్యేక జాతీయత ధృవీకరణ పత్రాలను అడుగుతారు.
దక్షిణాఫ్రికా: ఇక్కడ హోం వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో కేంద్రీకృత జనాభా రిజిస్టర్ ఉంటుంది. దీని ఆధారంగా జారీ చేసే ‘స్మార్ట్ ఐడి కార్డ్’, ‘సౌత్ ఆఫ్రికన్ సిటిజన్‌షిప్ సర్టిఫికేట్’ ద్వారా మాత్రమే అక్కడి పౌరసత్వాన్ని నిర్ధారిస్తారు. పాస్‌పోర్ట్‌ను కేవలం విదేశీ ప్రయాణాలకే పరిమితం చేస్తారు.
ఈ విధంగా, ఆయా దేశాల సార్వభౌమాధికారం, చట్టాలు, చారిత్రక పరిణామాలు, రక్షణ అవసరాలను బట్టి పౌరసత్వ ధృవీకరణ నియమాలు ప్రపంచవ్యాప్తంగా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి.
