వెళ్లి వాళ్లకు చెప్పు : దేశాధినేతలను ప్రశ్నించిన బాలికపై పుతిన్ విమర్శలు

వాతావరణంలో పెనుమార్పులకు కారణం ప్రభుత్వ పాలకులేనని, ఈ తరం.. నాయకులను ఎన్నటికీ క్షమించదని ఐక్యరాజ్యసమితి వేదికగా 16ఏళ్ల బాలిక గ్రెటా థన్‌బెర్గ్‌ ప్రపంచదేశాధినేతలను ప్రశ్నించిన విషయం తెలిసిందే. నాయకులు వారు సంపాదన కోసం పాకులాడే మనస్తత్వమే ఈ రోజు యువత భవిష్యత్తును, భవిష్యత్ తరాలను అంధకారంలోకి నెట్టేసిందని విరుచుకుపడింది.. మా జీవితాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారంటూ  ఈ పర్యావరణ కార్యకర్త నేతలను నిలదీసింది.

అయితే ప్రపంచ దేశాధినేతలను ప్రశ్నించిన గ్రేటా థన్ బర్గ్ పై రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ విమర్శలు గుప్పించారు. గ్రెటా వ్యాఖ్యలను  పుతిన్ బుధవారం(అక్బోటర్-2,2019) కొట్టిపారేశారు. స్వీడన్ లాగా కాకుండా…ఎందుకు మీరు పేదరికంలోనే జీవిస్తూ ఉన్నారని అభివృద్ధి చెందుతున్న దేశాలకు వెళ్లి  వాళ్లకు వివరించాలని థన్ బర్గ్ కు పుతిన్ సూచించారు. బుధవారం నిర్వహించిన ఓ ఎనర్జీ కాన్ఫరెన్స్ లో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని గ్రూప్ లు తమ సొంత లక్ష్యాలు సాధించుకునేందుకు గ్రెటా థన్ బర్గ్ ను ఉపయోగించుకోవడం దుర్భరకరమని పుతిన్ అన్నారు.

వాతావరణం, పర్యావరణ పరిరక్షణకై ఉద్యమిస్తోన్నస్వీడన్‌కు చెందిన 16ఏళ్ల గ్రెటా థన్‌బెర్గ్‌…ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్-23,2019న తన ఐక్యరాజ్యసమితి ప్రసంగం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. వాతావరణ పరిరక్షణపై నేతలు అప్పటికే వివిధ దేశాధినేతలు మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు దేశాధినేతలు పాల్గొని ప్రసంగించారు. కానీ వీరందరి ప్రసంగాలు షరామామూలు అన్నట్లే సాగాయి. అయితే గ్రేటా థన్‌బర్గ్ ప్రసంగం మాత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయంటే దానికి కారణం ప్రభుత్వాలు పాలకులే అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరం, నాయకులను ఎన్నటికీ క్షమించదని నాయకులను వేదికపై నుంచి కడిగి పారేసింది. తమ భవిష్యత్తును అంధకారంలో పడేసేందుకు హక్కు ఎవరిచ్చారంటూ ప్రశ్నించడమే కాదు.. అంతటి ధైర్యం ఎక్కడినుంచి వచ్చిందని మండిపడింది. తను ఎంతో చక్కగా స్కూళ్లో ఉండాల్సిన దాన్నని, తన వయసుకు ఈ సమావేశంలో పాల్గొనాల్సినదానిని కాదని, కానీ పాలకులు చేస్తున్న తప్పులకు పర్యావరణం దెబ్బతిని తమలాంటి యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారని అందుకే దీనిపై ప్రశ్నించేందుకు తాను ఐక్యరాజ్యసమితికి వచ్చానని గ్రేటా తన్‌బర్గ్ చెబుతూ భావోద్వేగానికి గురైంది.

పాలకులంతా కలిసి తను కన్న కలలను చెరిపివేశారని, పాలకులు చెప్పే వట్టి మాటలను నమ్మి తన బాల్యంను కోల్పోయినట్లు గ్రేటా తన్‌బర్గ్ చెప్పింది. ఎందుకంటే పాలకులు పర్యావరణంను దెబ్బతీస్తున్న సమయంలో చాలామంది సామాన్య ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. త్వరలో మనిషి కూడా క్రమంగా అంతరించిపోతాడని చెప్పిన గ్రేటా తన్‌బర్గ్… ఇప్పటికీ పాలకులు తమ దేశ ఆర్థిక వ్యవస్థ, డబ్బులు గురించే కథలు కథలుగా మాట్లాడుతారని చెప్పింది. మీకెంత ధైర్యం అంటూ ప్రశ్నించింది.

 తను పలువురు దేశాధినేతలతో మాట్లాడిన సమయంలో వారంతా యువత గొంతుకను ప్రభుత్వాలు వింటున్నాయని పర్యావరణంపై కచ్చితంగా మంచి జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని నమ్మబలికారని చెప్పింది గ్రేటా తన్‌బర్గ్. కానీ వారి మాటలు నమ్మశక్యంగా లేవని, ఒకవేళ నిజంగానే వారు పర్యావరణం నాశనమైపోతోంది అనే సత్యాన్ని గ్రహించి ఉంటే ఎప్పుడో చర్యలు ప్రారంభించేవారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక చివరిగా దేశాధినేతలు పాలకులు ప్రతీసారి యువత కన్న స్వప్నాలపై నీళ్లు చల్లుతున్నారని పర్యావరణంను కాపాడటంలో విఫలమవుతున్నారని చెబుతూ తన ప్రసంగంను ముగించింది గ్రేటా తన్‌బర్గ్.