పిల్లి కోసం మనవడ్ని పణంగా పెట్టిన బామ్మ

పెంపుడు జంతువుల మీద ప్రేమ ఉండటం సహజమే. కానీ, అదే ప్రేమ మనవడిపైనా ఉండాలిగా. ప్రేమ జాగ్రత్తను పెంచి భయాన్ని చూపించేలా చేస్తుందని తెలుసు. అలాంటిది ఇక్కడ తన పెంపుడు పిల్లి కోసం మనవడ్ని 500అడుగుల ఎత్తు ఉన్న మేడపై నుంచి రిస్క్ చేసింది ఓ బామ్మ. ఈ ఘటనలో చైనాలోని సిచువాన్ లో జరిగింది.
హావో హావో అనే ఏడేళ్ల కుర్రాడు.. బామ్మతో పాటు 500అడుగుల ఎత్తులో ఉన్న ప్లాట్‌లో ఉంటున్నారు. వాళ్లు ప్రేమగా పెంచుకుంటున్న పిల్లి తన ఇంటికి 50అడుగుల కింద పడిపోయింది. అయినా పిల్లి ప్రాణాలతోనే ఉంది. దానిని కాపాడుకునే క్రమంలో బామ్మ.. మనవడికి తాడు కట్టి కిందకు వదిలింది. ఈ ఘటన చూస్తున్న వాళ్లంతా షాక్ అయిపోయారు. ఆ బుడ్డోడికి ఓ సంచి కట్టి కిందకు వదలడంతో పిల్లి ఉన్న స్థలానికి చేరుకుని అందులో పిల్లిని వేసుకున్నాడు.
మళ్లీ అదే తాడుతో అతణ్ని పైకి లాగేసింది. తాడు లాగేందుకు ఆ బామ్మకు మరికొందరు సహాయం చేయడంతో ఏ ప్రమాదం లేకుండా అంతా బయటపడగలిగారు. ఇది జరుగుతున్నంత సేపు స్థానికులు బామ్మను వారిస్తూ అలా చేయొద్దంటూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావంటూ హెచ్చరించారు. పిల్లి, పిల్లోడు క్షేమంగా పైకి రావడంతో అక్కడ ఉన్న వాళ్లంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో మనవడి మీద కంటే పిల్లి మీద ప్రేమ ఎక్కువైపోయింది ముసలిదానికి అంటూ తిట్టిపోస్తున్నారు. ఆ బుడ్డోడి తల్లిదండ్రులు ఉద్యోగాల కోసం వేరే ఊరిలో ఉంటున్నారు. ఆ చిన్నారి మాత్రం తాత, బామ్మల వద్దే పెరుగుతున్నాడు.