Haiti Earthquake Death Toll Nears 1300
Haiti Earthquake : కరీబియన్ ద్వీప దేశమైన హైతీలో సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది. ఈ ఘోర విపత్తులో 1300మంది దుర్మరణం పాలయ్యారు. వేలమంది గాయపడ్డారు. భూకంపం తీవ్రతకు వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు స్థానిక అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. 7.2 తీవ్రతతో కుదిపేసిన ఈ భూకంపానికి పేద దేశమైన హైతీ విలవిలలాడుతోంది. రాజధాని పోర్టౌ ప్రిన్స్‌కు పశ్చిమాన 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. శనివారం రోజంతా ప్రకంపనలు కొనసాగాయి. ఆదివారం తెల్లవారు జామున కూడా 6 ప్రకంపనలు సంభవించాయి.
Read More : Petrol Rate Today : 30 రోజులుగా పెట్రోల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు
హృదయ విదారక దృశ్యాలు :-
ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. పెను విధ్వంసానికి ఇళ్లు, హోటళ్లు, ఇతర నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. భయంతో ఒక్కసారిగా ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారు. భారీగా మట్టిపెళ్లలు వంటివి విరిగిపడటంతో సహాయక చర్యలకు కూడా విఘాతం కలుగుతోంది. ఎంతోమంది నిరాశ్రయులు కాగా.. భయంతో ప్రజలంతా రాత్రివేళ బిక్కుబిక్కుమంటూ వీధుల్లోనే గడిపారు. తీరప్రాంత పట్టణమైన లెస్‌కేయస్ ఒక పట్టాన కోలుకోలేని రీతిలో దెబ్బతింది. ఇక్కడి నుంచి క్షతగాత్రులను పోర్టో ప్రిన్స్‌కు తరలించడానికి మాజీ సెనేటర్ ఒకరు ఓ ప్రైవేటు విమానాన్ని ఏర్పాటు చేశారు. గాయపడినవారితో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎంతో మంది తమ కుటుంబ సభ్యుల్ని, ఆత్మీయుల్ని, ఆస్తుల్ని పోగొట్టుకున్నారు. ఎవరిని కదిపినా కన్నీళ్లు వర్షిస్తున్నాయి. ఓ మార్కెట్‌లో పళ్లు, తాగునీరు కొంతమేర అందుబాటులో ఉంచగా.. ప్రజలు ఎగబడ్డారు. చాలామంది స్థానికులు లెస్‌కేయస్‌లోని ఓ ప్రార్థన మందిరంలో తలదాచుకున్నారు.
Read More : Dalit Bandhu : హుజూరాబాద్ కు సీఎం కేసీఆర్, ఏర్పాట్లు ఎలా చేశారో తెలుసా ?
అమెరికా సహాయం :-
భూకంప తీవ్రతకు దెబ్బతిన్న ప్రాంతాల్లో హైతీ ప్రధానమంత్రి ఏరియల్ హెన్రీ పర్యటించారు. ఈ కష్టకాలంలో ప్రజలంతా సంఘీభావంతో ఉండాలని కోరారు. దేశమంతటా నెల రోజుల పాటు అత్యయిక పరిస్థితిని విధించారు. కరేబియన్ దేశానికి తక్షణ సహాయం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదం తెలిపారు. ఆర్ధిక సంక్షోభంతో సతమతవుతున్న ప్రస్తుత తరుణంలో హైతీ ప్రజలకు భూకంపం రూపంలో మరో విపత్తు రావడం విచారకరమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని, పునఃనిర్మాణానికి చేయూతనిస్తామని వెల్లడించారు.