Hassan nasrallah: హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా హ‌తం.. ధృవీక‌రించిన ఇజ్రాయెల్

హసన్ నస్రల్లా ఇకపై ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేయలేడు అంటూ ట్వీట్ లో ఐడీఎఫ్ పేర్కొంది.

Hassan nasrallah: హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా హ‌తం.. ధృవీక‌రించిన ఇజ్రాయెల్

hassan nasrallah

Updated On : September 28, 2024 / 2:45 PM IST

Hezbollah leader hassan nasrallah: హెజ్‌బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతుంది. దక్షిణ లెబనాన్ లోని దాహియాలోని నివాసగృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను శుక్రవారం ఇజ్రాయెల్ ప్రయోగించింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ట్విటర్ వేదికగా ప్రకటించింది. హసన్ నస్రల్లా ఇకపై ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేయలేడు అంటూ ట్వీట్ లో ఐడీఎఫ్ పేర్కొంది. నస్రల్లా మరణ వార్తలపై హెజ్‌బొల్లా ఇంకా స్పందించలేదు. అయితే, శుక్రవారం రాత్రి నుంచి కాంటాక్ట్ లో లేడని హెజ్‌బొల్లా వర్గాలు వెల్లడించాయి.

Also Read : తగ్గేదే లేదు.. యూఎన్ వేదికగా ఇరాన్‌కు బిగ్ వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని.. ఆ రెండు మ్యాప్‌లలో ఏముందంటే?

దక్షిణ లెబనాన్ లోని దాహియాలోని నివాసగృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై శుక్రవారం ఐడీఎఫ్ వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. దాడుల సమయంలో నస్రల్లా అదే కార్యాలయంలో ఉన్నట్లు ఐడీఎఫ్ పేర్కొంది. తాజాగా అతడు మరణించినట్లు ధృవీకరించింది. ఇదిలాఉంటే.. నస్రల్లా కుమార్తె కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆమె మృతిపై కూడా హెజ్‌బొల్లా గానీ, లెబనాన్ అధికారులు ఇంకా ధృవీకరించలేదు. ఇజ్రాయెల్ మిలటరీ ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడుతూ.. నస్రల్లా హెజ్‌బొల్లా చీఫ్ గా 32 సంవత్సరాల పదవీకాలంలో అనేక మంది ఇజ్రాయెల్ పౌరులు, సైనికులను హతమార్చాడని, వేలాది ఉగ్రవాద చర్యలకు ప్రణాళికలు, అమలుకు బాధ్యత వహించాడని అన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో అమాయక పౌరులను బలిగొన్న ఉగ్రవాద దాడులకు హసన్ నస్రల్లా కారణమని తెలిపాడు.

 

ఐడీఎఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్జీ హలేవి.. హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణంపై స్పందిస్తూ.. ఎక్స్ ఖాతాలో ఓ పోస్టర్ షేర్ చేశాడు. ఇది టూల్ బాక్స్ లోని సాధానాల ముగింపు కాదు. సందేశం స్పష్టంగా, సరళంగా ఉంటుంది. ఎవరైనా ఇజ్రాయెల్ పౌరులను భయపెట్టడానికి, బెదిరించడానికి ప్రయత్నిస్తే వారిని ఎలా చేరుకోవాలో మాకు తెలుసు అంటూ పేర్కొన్నాడు.