బ్రెజిల్‌లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. బకబాల్ ప్రాంతంలో మెయారిమ్ నదిలో స్నానం చేయడానికి దిగిన 13 ఏళ్ల ఓ బాలిక నీటిలో గల్లంతైంది. కొన్ని రోజులుగా కనపడలేదు. ఈ ఘటనను వివరించేందుకు లెనిల్డో ఫ్రాజావో అనే రిపోర్టర్ నదిలోకి దిగి, దాని లోతు ఎంతుందో చెబుతున్నారు.
అక్కడ గల్లంతైన బాలిక స్నానం చేసిన ప్రదేశాన్ని వివరించే క్రమంలో నీటిలోపల ఉన్న ఆమె మృతదేహాన్ని ఆ రిపోర్టర్ అనుకోకుండా తొక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నది నీరు తన ఛాతీ వరకు వచ్చేదాక రిపోర్టర్ ఫ్రాజావో నీటిలోకి దిగాడు. ఆ తర్వాత ముందుకు వెళ్తుండగా అకస్మాత్తుగా ఉలిక్కిపడ్డారు. ఆయన కాళ్లకు ఏదో తగిలినట్లు అనిపించింది.
“కింద నీటి అడుగున ఏదో తాకింది” అని ఆయన తన కెమెరామన్‌కు చెప్పారు.”ఇక్కడ నీటికి అడుగున ఏదో ఉందని అనిపిస్తోంది” అన్నారు. వెంటనే రెండడుగులు వెనక్కు వెళ్లి.. “నాకు భయంగా ఉంది. అది చెయ్యిలా అనిపించింది. తప్పిపోయిన బాలికే అయి ఉండవచ్చు. లేదా చేప కూడా అయి ఉండొచ్చు. నాకు తెలియదు” అని అన్నారు.
ఫ్రాజావో ఈ వివరాలు తెలిపిన తర్వాత రెస్క్యూ బృందాలు మళ్లీ నదిలో వెతికాయి. ఆ అమ్మాయి మృతదేహం అదే ప్రదేశంలో దొరికింది. రైస్సా అనే అమ్మాయి తన స్నేహితులతో కలిసి ఈ నదిలో స్నానం చేస్తూ మునిగి మృతిచెందిందని పోలీసులు తెలిపారు.
పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. ఆ నదీ ప్రవాహం ఉద్ధృతంగానే ఉంటుందని, నీటి అడుగున గుంతలు ఉంటాయని అధికారులు చెప్పారు.
Brazilian journalist discovers body of missing 12yo girl while filming report about her disappearance pic.twitter.com/73ygG2tGYh
— RT (@RT_com) July 21, 2025