21 ఏళ్లకే సివిల్ సర్వీసెస్ పరీక్షలో 13వ ర్యాంకు.. IAS ఎంచుకోకుండా IFS ఎంచుకుని.. ఈ మేడం కథ తెలిస్తే సెల్యూట్ అనాల్సిందే..
ప్రస్తుతం విదుషి సింగ్ ఎక్కడ పని చేస్తున్నారు? IAS బదులు IFS ఎందుకు తీసుకున్నారు?

విదుషి సింగ్.. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చెందిన యువతి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2022లో అఖిల భారత స్థాయిలో 13వ ర్యాంకు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించడం, ఆమె వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే కావడంతో ఆమెను అందరూ ప్రశంసలతో ముంచెత్తారు.
విదుషి సింగ్‌లా ర్యాంకు తెచ్చుకున్నవారు అందరూ ఐఏఎస్‌ను ఎంపిక చేసుకుంటారు. విదుషి సింగ్ మాత్రం ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS)ను ఎంచుకోవడం గమనార్హం. ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ కారణం ఉంది. తన గ్రాండ్ పేరెంట్స్ స్వప్నాన్ని నెరవేర్చాలన్నదే ఆమె కల.
విదుషి సింగ్ కల ఇలా నెరవేరింది..
విదుషి జోధ్‌పూర్‌లో జన్మించి, అయోధ్యలో చదువుకుంటూ పెరిగారు. జేబీ అకాడమీలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో 98.2 శాతం మార్కులు సాధించారు. అనంతరం ఆమె ఢిల్లీలోని ప్రఖ్యాత శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) నుంచి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మూడో సంవత్సరం నుంచి UPSCకి సిద్ధమవడం ప్రారంభించిన ఆమె.. కరోనా లాక్‌డౌన్ కాలాన్ని బాగా వినియోగించి పూర్తి సమయం UPSCకి కేటాయించారు.
NCERT పుస్తకాల ఆధారంగా జనరల్ స్టడీస్ (GS) స్వయంగా చదివారు. 2022లో విదుషి సింగ్ UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో 1039 మార్కులు (రాత పరీక్షలో 855, ఇంటర్వ్యూలో 184) సాధించి ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 13 సాధించారు. ఈ విజయం ఆమెను భారతదేశంలోనే అతి పిన్న వయస్కురాలైన UPSC టాపర్‌గా నిలబెట్టింది. ఎకనామిక్స్ ఆమె ఆప్షనల్ సబ్జెక్ట్. ఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరకుండా పూర్తిగా సొంతంగా చదువుకుని ఈ ఘనత సాధించడం ఆమె పట్టుదలకు నిదర్శనం.
IAS బదులు IFS ఎందుకు?
చాలా మంది UPSC టాపర్లు IAS అధికారులు కావాలని కలలు కంటుంటారు. కానీ విదుషి సింగ్ మాత్రం అందరికీ భిన్నంగా ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారిని కావాలని అనుకున్నారు. ఈ నిర్ణయం వెనుక హృదయాన్ని హత్తుకునే ఓ కథ ఉంది.
మీడియా నివేదికల ప్రకారం.. తన గ్రాండ్ పేరెంట్స్.. విదుషి IFS అధికారిని కావాలని, విదేశాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కనేవారు. వారి కోరికను నెరవేర్చడమే విదుషి జీవిత లక్ష్యంగా మారింది. ఆమె తన కుటుంబానికి ఇచ్చిన ఈ మాటకు కట్టుబడి, అత్యంత ప్రజాదరణ పొందిన IAS/IPS సేవలను వదులుకొని IFSని ఎంచుకున్నారు.
ప్రస్తుతం విదుషి సింగ్ ఎక్కడ పని చేస్తున్నారు?
ప్రస్తుతం విదుషి సింగ్ పారిస్‌లోని భారత రాయబార కార్యాలయంలో థర్డ్ సెక్రటరీ (LT)గా పనిచేస్తున్నారు. భారత విదేశాంగ సేవ (IFS) దేశంలో అత్యంత గౌరవనీయమైన సర్వీసుల్లో ఒకటి. IFS అధికారులు ప్రపంచవ్యాప్తంగా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లు, మిషన్లలో పనిచేస్తూ, ఇతర దేశాలతో భారతదేశ సత్సంబంధాలు కొనసాగేలా బాధ్యత వహిస్తారు. వారు ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు.