How Did A 400m Long Megaship Get Stuck In The Narrow Suez Canal
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే జలమార్గం.. సూయజ్ కెనాల్.. గతవారమే 400 మీటర్ల పొడవైన 224వేల టన్నుల భారీ నౌక ఎవర్ గివెన్ ఇరుకైన సూయజ్ కాలువలో చిక్కుకుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద కంటైనర్లను క్యారీ చేసే భారీ నౌక ఇది.. భారీ ఇసుక తుపాను గాలుల ధాటికి కంట్రోల్ తప్పి ఈ నౌక ఇసుకలో చిక్కకుంది. ఇరుకైనా కెనాల్ కు అడ్డంగా నిలిచింది. దాంతో అటుగా వెళ్లే నౌకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వందల సంఖ్యలో నౌకలన్నీ నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ అయినట్టు సూయజ్ కెనాల్ అధికారులు వెల్లడించారు. ప్రతిరోజు ఇదే జలమార్గంలో 30శాతం ప్రపంచ కంటైనర్ షిప్ లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇప్పుడు నౌకయానం నిలిచిపోవడంతో ప్రపంచ ఆయిల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. చమురు ధరలు పెరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే 300కు పైగా నౌకలు నిలిచిపోగా.. కొన్ని నౌకలు ఆఫ్రికా గుండా మరో జల మార్గంలో తమ గమ్యాన్ని చేరుకుంటున్నాయి.
శనివారం నాటికి 20వేల టన్నుల ఇసుకను తొలగించారు. 14టగ్ బోట్లతో ఎవర్ గివెన్ నౌకను కదిలిచేందుకు ప్రయత్నించిన ఫలితం శూన్యం. ప్రాథమిక నివేదిక ప్రకారం.. 1300 చదరపు అడుగుల విస్తీర్ణం, 2లక్షల టన్నుల బరువైన నౌక.. బలమైన ఇసుక తుపాను ధాటికి ముందుకు వెళ్లే మార్గం కనిపించక చిక్కుకుందని సూయిజ్ కెనాల్ అథారిటీ చైర్మన్ ఒసామా రాబె తెలిపారు. నౌక చిక్కుకుపోవడానికి వాతావరణ పరిస్థితులు కారణం కాదని ఒసామా పేర్కొన్నారు.