US Study: బూస్టర్ డోస్ ప్రభావం కూడా కొంతకాలమే.. నాలుగో డోసూ అవసరం కావొచ్చు!

ప్రపంచ వ్యాప్తంగా కరోనాపై టీకాస్త్రంతో పోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ చాలా దేశాల్లో రెండు డోసుల టీకాలు అందించారు.

US Study: బూస్టర్ డోస్ ప్రభావం కూడా కొంతకాలమే..  నాలుగో డోసూ అవసరం కావొచ్చు!

Booster Dose

Updated On : February 13, 2022 / 8:45 AM IST

US Study: ప్రపంచ వ్యాప్తంగా కరోనాపై టీకాస్త్రంతో పోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ చాలా దేశాల్లో రెండు డోసుల టీకాలు అందించారు. అయితే వ్యాక్సిన్ల సామర్ధ్యం కొన్ని రోజులు తర్వాత తగ్గిపోవడంతో బూస్టర్‌ డోసు ఇస్తున్నారు. అయితే ఈ బూస్టర్ డోసు కూడా కొన్ని రోజులే పనిచేస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది.

అమెరికాలో వినియోగిస్తున్న ఫైజర్, మోడెర్నా టీకాల మూడో డోసు ప్రభావం నాలుగో నెల నాటికే గణనీయంగా తగ్గుతున్నట్లు అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. గతేడాది ఆగస్ట్ 26 నుంచి ఈ ఏడాది జనవరి 22 మధ్య కాలంలో 2.41 లక్షల మందికి కోవిడ్ సోకిన వృద్ధుల నుంచి సమాచారం సేకరించింది.

అలాగే పరిస్థితి ఆందోళనకరంగా ఉండి ఆసుపత్రుల్లో చేరిన 93 వేలకుపైగా రోగులనుంచి సమాచారాన్ని సేకరించి నివేదిక రూపొందించారు. కొవిడ్‌ పాజిటివ్‌ ఫలితాలను పోల్చడంతో పాటు ప్రాంతం, వయస్సు, అనారోగ్య సమస్యలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యాక్సిన్ ప్రభావాన్ని అంచనా వేశారు.

ఈ అధ్యయనం ప్రకారం.. ఒమిక్రాన్‌పై మూడో డోస్‌ తర్వాత ప్రభావం మొదటి రెండు నెలల్లో 91 శాతం ఉంది. నాలుగో నెల నాటికి 78శాతానికి పడిపోయింది. దీంతో బూస్టర్‌ ప్రభావం క్రమంగా తగ్గినట్టు తేల్చారు. ఒమిక్రాన్‌పై పోరాటంలో భాగంగా అమెరికాలో పౌరులకు నాలుగో డోసూ వేయాల్సిన అవసరం రావొచ్చని ఇప్పటికే సూచించారు. తాజా సీడీసీ అధ్యయనంతో మరోసారి నాలుగోడోసుపై ప్రాధాన్యం సంతరించుకుంది.