రష్యాతో బ్రెజిల్, చైనా, భారత్ వ్యాపారాన్ని కొనసాగిస్తే సెకండరీ టారిఫ్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుందని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరించారు. అమెరికా కాంగ్రెస్‌లో మార్క్ రుట్టే సెనేటర్లను కలిసిన అనంతరం ఈ హెచ్చరిక జారీ చేశారు.
రష్యా ఉత్పత్తులను కొనే దేశాలు 100 శాతం టారిఫ్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. రష్యాతో పోరాడుతున్న యుక్రెయిన్‌కి కొత్తగా ఆయుధ సాయాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 50 రోజుల్లో శాంతి ఒప్పందం కుదరకపోతే ఈ టారిఫ్‌లు విధిస్తామని అన్నారు.
ఇప్పుడు మార్క్ రుట్టే కూడా బ్రెజిల్, చైనా, భారత్‌కు కీలక సూచనలు చేశారు. “చైనా, భారత్, అలాగే బ్రెజిల్ అధ్యక్షుడు ఈ విషయాన్ని గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఇది మీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది” అని రుట్టే అన్నారు.
ట్రంప్‌తో సోమవారం సమావేశమయ్యామని, ఈ చర్యలు తీసుకునేందుకు అంగీకారం కుదిరిందని తెలిపారు. “అందుకే వ్లాదిమిర్ పుతిన్‌కి ఫోన్ చేసి శాంతి చర్చలను సీరియస్‌గా తీసుకోవాలని చెప్పాలి. లేకపోతే బ్రెజిల్, ఇండియా, చైనా మీద భారీగా ప్రభావం పడుతుంది” అని రుట్టే హెచ్చరించారు.
Also Read: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి షాక్.. లుక్ అవుట్ నోటీసులు జారీ
శాంతి చర్చల్లో యుక్రెయిన్‌కు మద్దతుగా నిలిచేందుకు యూరప్ అవసరమైన నిధులను సమకూరుస్తుందని తెలిపారు. యుక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి మిసైల్‌లు అందిస్తారా? అన్న ప్రశ్నకు రుట్టే స్పందిస్తూ.. “రక్షణతో పాటు దాడికి సంబంధించిన ఆయుధాలు కూడా ఉన్నాయి. అనేక రకాల ఆయుధాలపై చర్చ జరుగుతోంది. కానీ మేము వీటిపై ట్రంప్‌తో పూర్తి స్థాయిలో చర్చించలేదు. ప్రస్తుతం పెంటగాన్, యూరప్‌లో ఉన్న సుప్రీం అలైడ్ కమాండర్, యుక్రెయిన్ అధికారులు కలిసి దీనిపై చర్చిస్తున్నారు” అని వివరించారు.
కాగా, అమెరికా రిపబ్లికన్ సెనేటర్ థామ్ టిల్లిస్ కూడా ట్రంప్ చర్యలను ప్రశంసించారు. అయితే, 50 రోజుల వ్యవధి ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ 50 రోజుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్‌పై మరిన్ని దాడులు చేయొచ్చని అన్నారు.