Imran Govt Hasnt Approved The Proposal To Import Cotton From India
Imran govt భారత్ నుంచి పత్తి,చక్కెర దిగుమతికి బుధవారం పాకిస్తాన్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే,24గంటల్లోనే పాకిస్తాన్ ప్రదానమంత్రి ఇమ్రాన్ ఖాన్ యూటర్న్ తీసుకున్నారు. భారత్ నుంచి పత్తి,చక్కెర దిగుమతి చేసుకోవాలన్న ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ(ECC)ప్రతిపాదనను పాక్ కేబినెట్ తిరస్కరించింది.
కాగా, 2019లో జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య తెగిపోయిన సంబంధాలను తిరిగి కలుపుకోవడంలో భాగంగా భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై విధించిన నిషేదాన్ని ఎత్తివేస్తున్నట్లు పాక్ సర్కారు బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఆర్థికశాఖ మంత్రి హమ్మద్ అజహర్ అధ్యక్షతన జరిగిన ECC మీటింట్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం నుండి పత్తి మరియు చక్కెర దిగుమతితో సహా ఎజెండాలోని 21 అంశాలపై ఈ సమావేశంలో చర్చించామని ఆర్థికమంత్రి అజార్ చెప్పారు. పాకిస్తాన్ లో వస్త్ర పరిశ్రమలో ముడి సరుకు కొరత ఉన్నందున పత్తి, దారం ఇండియా నుంచి దిగుమతి చేసుకోవాలని, దీనికి సంబంధించి దిగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం ద్వారా వస్త్రరంగానికి మేలు జరుగుతుందని కమిటీ అభిప్రాయపడిందని మంత్రి తెలిపారు.
ఆగస్టు5,2019న జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత నిలిపివేయబడిన వస్తువుల దిగుమతిని తిరిగి ప్రారంభించడం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల పాక్షిక పునరుద్ధరణకు దారితీస్తుందని అందరూ భావించారు. పాక్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ దేశం గట్టెక్కడమే కాకుండా, భారత్‌లోని వస్త్రరంగానికి ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇంతలోనే పాక్ ప్రధాని భారత్ నుంచి దిగుమతలపై యూటర్న్ తీసుకున్నారు.