Sri Lanka Pm Ranil Wickremesinghe
Sri Lanka : శ్రీలంక కొత్త ప్రధానిగా గురువారం (మే 12,2022)బాధ్యతలు చేపట్టారు రణిల్ విక్రమ సింఘే. 73 ఏళ్ల యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్పీ)కి చెందిన ఆయన శ్రీలంక 26వ ప్రధానిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కష్ట సమయాల్లో భారత్ ఆర్థిక సాయం చేసి ఆదుకుందని అన్నారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న మా దేశాన్ని విముక్తి చేయటమే ప్రస్తుతం తన ముందున్న ప్రథమ లక్ష్యం అని అన్నారు. నేను భారత్ తో అత్యంత సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నానని చెప్పారు.
దేశంలో పెట్రోల్, డీజిల్, విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. వసరమైతే నిరసనకారులతో మాట్లాడుతానని, వాళ్లను ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక సంక్షోభం వంటి తీవ్ర సమస్యనే ఎదుర్కోగా లేనిది.. వారిని ఎదుర్కోలేనా? అని అన్నారు రణిల్ విక్రమ సింఘే. కాగా..శ్రీలంక కష్టాల్లో ఉండగా భారత్ 300 కోట్ల డాలర్లు సాయం చేసింది. దాంతో పాటు బియ్యం, డీజిల్, వంటి నిత్యావసరాలను కూడా అందించింది.
1948లో బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందిన తర్వాత శ్రీలంక అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొలంబోతో పాటు ఇతర ప్రాంతాలలో శాంతియుతంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదేశాలపై ప్రభుత్వ మద్దతుదారులు దాడి చేయడంతో సోమవారం ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో 8 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు.
నాలుగుసార్లు దేశ ప్రధానిగా పనిచేసిన విక్రమసింఘేను 2018 అక్టోబర్‌లో అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రధాని పదవి నుంచి తప్పించారు. రెండు నెలల తర్వాత సిరిసేన ఆయనను మళ్లీ ప్రధానిగా నియమించారు.