మరి ఆ డబ్బు సంగతేంటి? ట్రంప్ ఇన్నాళ్లూ వసూలు చేసిన రూ.15 లక్షల కోట్లు తిరిగి వస్తాయా?
రీఫండ్లు పంపిణీ అయినా, వాటిని కోరిన కొన్ని కంపెనీలు డబ్బు పొందకపోవచ్చు. కారణం ఆ కంపెనీ ఇంపోర్టర్ ఆఫ్ రికార్డ్ కాకపోవచ్చు.
- రీఫండ్ పొందడానికి దిగుమతిదారులు ఏమి చేయాలి?
- డబ్బు ఎలా తిరిగి ఇవ్వాలో సుప్రీంకోర్టు చెప్పిందా?
- గతంలో ఇటువంటి కేసుల్లో ఏం జరిగింది?
Donald Trump tariffs: అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై విధించిన టారిఫ్‌లు చట్టవిరుద్ధమని యూఎస్ సుప్రీంకోర్టు చెప్పింది. మరి ట్రంప్ ఇన్నాళ్లూ వసూలు చేసిన రూ.15 లక్షల కోట్ల మాటేంటి? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
చట్టవిరుద్ధంగా వసూలు చేసిన ఈ టారిఫ్‌లను ప్రభుత్వం ఎలా రీఫండ్ చేయాలో సుప్రీంకోర్టు చెప్పలేదు. టారిఫ్‌లు వెనక్కి ఇచ్చేస్తారా? అన్న ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. “ఈ వ్యవహారం మరో ఐదేళ్లు కోర్టుల్లోనే కొనసాగుతుంది” అని చెప్పారు.
టారిఫ్‌లు ఎలా వసూలు చేస్తారు?
దిగుమతి సరుకులపై ప్రభుత్వం విధించే పన్ను(టారిఫ్)కు లోబడే దాదాపు అన్ని సరుకుల విషయంలో, దిగుమతిదారు సరుకులను అమెరికాలోకి తీసుకురావడానికి ముందుగా బాండ్‌ను కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సంస్థ వద్ద జమ చేసి, అంచనా టారిఫ్ మొత్తాన్ని చెల్లిస్తాడు.
ఆ సరుకులపై తుది టారిఫ్ మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ ప్రక్రియను లిక్విడేషన్ (దిగుమతి తర్వాత తుది పన్ను లెక్కలు ఖరారు చేసే విధానం) అంటారు.
సాధారణంగా సరుకు ప్రవేశించిన 314 రోజుల తర్వాత ఇది జరుగుతుంది. ఎక్కువగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇస్తారు లేదా తక్కువైతే దిగుమతిదారు మిగిలిన మొత్తాన్ని చెల్లించాలి. దిగుమతిదారులు తుది టారిఫ్ చెల్లింపులు నిర్ణయించే ప్రక్రియను నిలిపివేయాలని అమెరికా అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానంలో కేసు వేశారు. అయితే, ఆ న్యాయస్థానం అభ్యర్థనను తిరస్కరించింది.
Also Read: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశారు?
డబ్బు ఎలా తిరిగి ఇవ్వాలో సుప్రీంకోర్టు చెప్పిందా?
డబ్బు ఎలా తిరిగి ఇవ్వాలో సుప్రీంకోర్టు చెప్పలేదు. ఈ కేసు ఇప్పుడు రీఫండ్ల విషయాన్ని పరిశీలించేందుకు మళ్లీ అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానానికి వెళ్తుంది.
రీఫండ్ల కోసం దిగుమతిదారులు వాణిజ్య న్యాయస్థానంలో 1,000కి పైగా కేసులు వేశారు. ఇంకా పెద్ద సంఖ్యలో కొత్త కేసులు రావచ్చు. వడ్డీతో రీఫండ్లు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం తనకు ఉందని కోర్టు ఇప్పటికే చెప్పింది. ఈ అధికారాన్ని సవాలు చేయబోమని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కోర్టులో తెలిపింది. దీంతో రీఫండ్లకు సంబంధించిన చట్టపరమైన అడ్డంకులు తగ్గాయని వాణిజ్య నిపుణులు చెప్పారు.
రీఫండ్ పొందడానికి దిగుమతిదారులు ఏమి చేయాలి?
ప్రతి దిగుమతిదారుడు రీఫండ్ కోసం అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానంలో కేసు వేయాల్సి రావచ్చు. విస్తృతంగా టారిఫ్‌లు చెల్లించిన కంపెనీలను ఒకేసారి కవర్ చేసే క్లాస్ యాక్షన్ (ఒకే సమస్యపై అనేక మంది కలిసి వేసే సమూహ వ్యాజ్యం) ఏర్పడుతుందో లేదో స్పష్టత లేదని న్యాయ నిపుణులు తెలిపారు. అమెరికా వాణిజ్య చట్టం ప్రకారం రీఫండ్ కోరేందుకు దిగుమతిదారులకు 2 సంవత్సరాల గడువు ఉంటుంది.
ఈ ప్రక్రియ చిన్న వ్యాపారాలపై ఎక్కువ ప్రభావం చూపవచ్చు. బలమైన ఆర్థిక వనరులు ఉన్న కోస్ట్కో వంటి కంపెనీలతో పోలిస్తే చిన్న వ్యాపారాలు టారిఫ్‌ల వల్ల ఎక్కువ నష్టపోయాయి. కొంతమంది చిన్న దిగుమతిదారులు వేల డాలర్లను న్యాయస్థానాల్లో కేసుల కోసం ఖర్చు చేయలేక రీఫండ్ ప్రయత్నాన్ని వదిలేయవచ్చు.
గతంలో ఇటువంటి కేసుల్లో ఏం జరిగింది?
అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం ఇంతకుముందు పెద్ద స్థాయి రీఫండ్లను పర్యవేక్షించింది. అమెరికా కాంగ్రెస్ 1986లో హార్బర్ మెయింటెనెన్స్ ట్యాక్స్ (పోర్టులలో సరుకు రవాణా విలువపై విధించిన పన్ను) అమలు చేసింది. 1998లో సుప్రీంకోర్టు ఆ పన్నులో భాగం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది. 100,000 కంటే ఎక్కువ దరఖాస్తుదారులతో కూడిన రీఫండ్ ప్రక్రియను అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం పర్యవేక్షించింది. ఈ ప్రక్రియను న్యాయమూర్తి జేన్ రెస్టానీ నిర్వహించారు. ఆమె ఇప్పటికీ ఆ కోర్టులో కొనసాగుతున్నారు.
ఇప్పుడు, టారిఫ్ చెల్లింపుల వివరాలను ప్రభుత్వం నమోదు చేసి, రికార్డు నిర్వహణ వ్యవస్థలను మెరుగుపరచింది. దీంతో రీఫండ్ సైజు నిర్ణయించడం సులభమవుతుందని వాణిజ్య నిపుణులు చెప్పారు. చిన్న వ్యాపారులు ఆటోమేటిక్ రీఫండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాయి. రీఫండ్ ప్రక్రియను నెమ్మదింపజేసేలా ప్రవేశ పత్రాలను ప్రభుత్వం కఠినంగా పరిశీలించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి.
రీఫండ్లు పంపిణీ అయినా, వాటిని కోరిన కొన్ని కంపెనీలు డబ్బు పొందకపోవచ్చు. కారణం ఆ కంపెనీ ఇంపోర్టర్ ఆఫ్ రికార్డ్ (దిగుమతికి సంబంధించిన అన్ని చట్టపరమైన బాధ్యతలు అధికారికంగా ఎవరి పేరుపై ఉంటాయో ఆ వివరాలు నమోదు చేసిన సంస్థ) కాకపోవచ్చు.
రీఫండ్ పంపిణీ అయిన తర్వాత, టారిఫ్ చెల్లించిన సంస్థ, నమోదు చేసిన దిగుమతిదారు మధ్య ఒప్పందంపై ఆధారపడి తుది డబ్బు ఎవరికో నిర్ణయిస్తారు. ఇది మరో చట్టపరమైన వివాదానికి దారి తీసే అవకాశం ఉంది.
ఈ ప్రక్రియ సంవత్సరాల పాటు కొనసాగవచ్చు అని వాణిజ్య సంఘాలు హెచ్చరించాయి. అందుకే రీఫండ్ పొందే అవకాశమున్న కొన్ని కంపెనీలు తమ క్లెయిమ్ హక్కులను వాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులకు విక్రయిస్తున్నాయి.
