Iran Strikes Israel Nuclear Site : ఇజ్రాయెల్ అణు కేంద్రం లక్ష్యంగా ఇరాన్ దాడి.. 180 మందికి గాయాలు.. తీవ్ర ఉద్రిక్తత!
Iran Strikes Israel Nuclear Site : ఇరాన్ న్యూ క్లియర్ ప్లాంట్ మీద జరిపిన దాడికి ప్రతీకారంగా.. నేడు అది ఇజ్రాయెల్ అణు స్థావారాన్ని టార్గెట్ చేసుకుని దాడి చేసింది.
Iran strikes towns near Israels key nuclear site Dimona and Arad at least 180 wounded
Iran Strikes Israel Nuclear Site : అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ మూడు దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత అత్యంత తీవ్రమైన పరిణామం నేడు చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపిన ప్రకారం ఇజ్రాయెల్ అణు కేంద్రం లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడుల్లో.. ఇజ్రాయెల్ దక్షిణ నగరమైన డిమోనాలో ఉన్న ప్రధాన అణు కేంద్రం ఉన్న ప్రాంతంతో పాటు సమీపంలోని అరాద్‌లో కనీసం 180 మంది గాయపడ్డారని తెలిపారు. ఇరాన్ దీనిపై స్పందిస్తూ.. తమ దేశంలోని నటాంజ్ న్యూక్లియర్ ప్లాంట్ మీద జరిగిన దాడికి ప్రతిస్పందనగా దీన్ని పేర్కొంది.
ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించిన ప్రకారం, అరాద్‌లో కనీసం 116 మంది గాయపడ్డారు. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. భారీ ఆస్తి నష్టం సంభవించింది. డిమోనాలో మరో 64 మంది గాయపడగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పలు నివాస భవనాలు ధ్వంసం కావడంతో ఎక్కువ మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 10 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు సమాచారం.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు దీనిపై స్పందిస్తూ.. ఇది “కష్టమైన సాయంత్రం”గా వర్ణించారు. ఇరాన్‌పై దాడులను కొనసాగిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 28 నుంచి అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో 1,500 మందికి పైగా మరణించినట్లు, అందులో కనీసం 200 మంది పిల్లలు ఉన్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.
ఇజ్రాయెల్ సైన్య ప్రతినిధి ప్రకారం, దాడుల సమయంలో వైమానిక రక్షణ వ్యవస్థలు పనిచేసినా, కొన్ని క్షిపణులను అడ్డుకోలేకపోయాయని.. అందుకే ఈ పరిస్థితి ఎదురైందన్నారు. ఫైర్ సర్వీస్ అధికారులు మాట్లాడుతూ.. డిమోనా, అరాద్ ప్రాంతాల్లో అడ్డుకునే క్షిపణులు ప్రయోగించినప్పటికీ లక్ష్యాలను చేధించలేకపోయాయని.. ఫలితంగా వందల కిలోల బరువు గల వార్హెడ్లతో కూడిన రెండు బాలిస్టిక్ క్షిపణులు నేరుగా దాడి చేశాయి అని తెలిపారు.
దాడుల తర్వాత 88 మంది ఆసుపత్రిలో చేరినట్లు మాగెన్ డేవిడ్ అడోమ్ అనే ఎమర్జెన్సీ సర్వీసెస్ సంస్థ తెలిపింది. దాడుల అనంతరం నెతన్యాహు అరాద్ మేయర్‌తో మాట్లాడారు. మన భవిష్యత్ కోసం జరుగుతున్న ఈ పోరాటంలో.. నేటి సాయంత్రం చాలా క్లిష్టమైనది. అన్ని శాఖలు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని నేను నా కార్యాలయ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించాను అంటూ నెతన్యాహూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇరాన్ దాడి తర్వాత ఇజ్రాయెల్‌లోని అన్ని పాఠశాలలను మూసివేశారు. విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు.
