Ayatollah Ali Khamenei
Ayatollah Ali Khamenei : ఆ దేశంలో ఆయన మాటే వేదం.. ఆయన మాటే శాసనం. పాశ్చాత్య దేశాలు, మానవ హక్కుల సంఘాలు ఆయనను ఒక ‘మతపరమైన నియంత’గా పరిగణిస్తాయి. కానీ దేశీయులు మాత్రం ఆయనను విముక్తి ప్రదాతగా భావిస్తాయి.. ఆయనే అయతుల్లా అలీ ఖమేనీ. ఇరాన్, అమెరికా సైన్యాలు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో ఖమేనీ మరణించారు. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ పేరుతో ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్‌పై భీకర దాడులు చేశాయి. ఈ క్రమంలో ఖమేనీ కార్యాలయం లక్ష్యంగా జరిగిన భారీ దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించాడు. ఖమేనీ మరణాన్ని ఇరాన్ ధృవీకరించింది. ఖమేనీ మృతితో ఇరాన్ ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. అదే సమయంలో మరికొంతమంది వీధుల్లోకి వచ్చిన ఖమేనీ మృతి పట్ల సంబరాలు చేసుకుంటున్నారు.
దశాబ్దాల క్రితం ఇస్లామిక్ విప్లవానికి నాయకత్వం వహించిన అయతుల్లా రుహోల్లా ఖమేనీ మరణం తరువాత.. 1989లో అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టాడు. పహ్లావీ రాచరిక పాలనను అంతం చేసిన విప్లవం వెనుక సైద్ధాంతిక శక్తి రుహోల్లా ఖమేనీ అయినప్పటికీ.. ఇరాన్ తన శత్రువుల నుంచి రక్షణ పొందడంతోపాటు.. సరిహద్దులు దాటి తన సత్తాను చాటేలా సైనిక, పారామిలిటరీ శక్తిని పెంపొందించింది మాత్రం అలీ ఖమేనీనే.
1939లో మషద్‌లోని ఒక సాంప్రదాయ మతపరమైన కుటుంబంలో ఖమేనీ జన్మించాడు. మొత్తం ఎనిమిది మంది సంతానంలో ఈయన రెండో వారు. ఇరాన్ లో ఆధిపత్యవర్గమైన షియా ముస్లిం శాఖలో ఈయన తండ్రి మధ్యస్థాయి మతగువురు. చిన్న వయసులోనే ఖురాన్ ను లోతుగా అధ్యయనం చేసిన ఖమేనీ.. 11ఏళ్లకే మతగురువు అయ్యారు. 1979లో నాటి ఇస్లామిక్ విప్లవంలో ఆయన కీలక పాత్ర పోషించారు. షా మహమ్మద్ రెజా పహ్లానీ అణచివేత పాలనకు వ్యతిరేకంగా గళమెత్తి, పలుసార్లు జైలు శిక్షను ఖమేనీ అనుభవించారు. బహిష్కరణకు సైతం గురయ్యారు. విప్లవం విజయవంతం తరువాత.. ఇరాన్ గణతంత్ర వ్యవస్థలో తిరుగులేని నేతగా ఎదిగారు.
1979 ఇస్లామిక్ విప్లవం వచ్చిన ఏడాది తరువాత.. రాజధాని తెహ్రాన్ లో శుక్రవారం ప్రార్థనల నాయకునిగా ఖమేనీ నియమితులయ్యారు. ఆ తరువాత 1981లో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1989 వరకు దేశ అధ్యక్షుడిగా హోదాలో కొనసాగిన ఆయన తనదైన పాలన సాగించారు. 86 ఏళ్ల వయసులో సుప్రీం లీడర్ రుహోల్లా ఖమేనీ మరణం తర్వాత, 1989లో ఆయన వారసుడిగా అయతుల్లా అలీ ఖమేనీని మతపెద్దలు ఎంపిక చేశారు. అప్పటి నుంచి నేటి వరకు దాదాపు దాదాపు 37ఏళ్లు దేశ భవిష్యత్తును తన శాసించారు.
అయతుల్లా అలీ ఖమేనీ తన పాలనలో బయట నుంచి ఎదురయ్యే ముప్పుల నుంచే కాకుండా దేశంలో తలెత్తిన అసమ్మతిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 2009 నాటి గ్రీన్ మూవ్‌మెంట్ నిరసనలు, అలాగే 2022లో ప్రజల నుంచి వచ్చిన తీవ్ర తిరుగుబాట్లను ఆయన తన అధికార బలంతో పూర్తిగా అణచివేశారు. ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ ప్రభావం దేశ సరిహద్దులు దాటింది. లెబనాన్, ఇరాక్, సిరియా, యెమెన్ వంటి దేశాల్లోని ఇరాన్ అనుకూల వర్గాలకు అండగా నిలిచింది. ఈ క్రమంలో అమెరికా, ఇజ్రాయెల్‌కు ఖమేనీ నిరంతరం సవాలు విసిరారు. అమెరికాతో ఖమేనీకి ఉన్న వైరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 2015 నాటి అణు ఒప్పందం నుంచి 2018 లో డొనాల్డ్ ట్రంప్ వైదొలగడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ఖమేనీ ఏనాడూ అమెరికా ఒత్తిళ్లకు లొంగలేదు.
చివరి సంవత్సరాల్లో ఆర్థిక సంక్షోభం, ప్రజా నిరసనలు, హమాస్–హిజ్బుల్లా బలహీనత, అమెరికా–ఇజ్రాయెల్ దాడులు వంటి పరిణామాలు ఆయన పాలనను కుదిపేశాయి. ఈ ఏడాది ప్రారంభంలోనూ ఇరాన్ అగ్నిగుండంలా మారింది. ఖమేనీ వ్యతిరేక నిరసనలతో ఆ దేశం అట్టుడికింది. రాజకీయ, ఆర్థిక మార్పులు డిమాండ్ చేస్తూ ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. దీంతో కొన్ని రోజులు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్లు నిలిపివేశారు. ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చిన నిరసనలు తెలిపారు. తాజాగా. ఖమేనీ మృతితో ఆయనకు వ్యతిరేఖీయులు రోడ్లపైకి వచ్చి సంబురాలు చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో ఖమేనీ మృతిపట్ల ప్రజలు సంబరాల్లో మునిగిపోవడం గమనార్హం.