Iran Israel War: న్యూక్లియర్ ప్లాంట్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడి? ఇరాన్ రాయబారి సంచలన ఆరోపణలు
అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రత్యేకంగా నతాంజ్ సుసంపన్న కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని రెజా నజాఫీ ఆరోపించారు.
Representative Image (Image Credit To Original Source)
- ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులు?
- ఇరాన్ ను నాశనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణలు
- అణు కేంద్రాలపై దాడులు జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడి
Iran Israel War: ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ పై దాడి జరిగిందా? ఇరాన్‌లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేశాయా? అంటే.. అవుననే అంటున్నారు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA)లోని ఇరాన్ రాయబారి రెజా నజాఫీ. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA)లోని ఇరాన్ రాయబారి రెజా నజాఫీ సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్‌లోని న్యూక్లియర్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేశాయన్నారు. ఇరాన్‌ను నాశనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన.. వాటిని ఖండిస్తున్నట్లు చెప్పారు.
అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రత్యేకంగా నతాంజ్ సుసంపన్న కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని రెజా నజాఫీ ఆరోపించారు. దీనిని ఆయన “చట్టవిరుద్ధమైన, నేరపూరితమైన, క్రూరమైన” దాడులుగా అభివర్ణించారు. ఇరాన్ శాంతియుతంగా రక్షించబడిన అణు కర్మాగారాలపై దాడి చేశారని.. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయాలనుకుంటుందని చెప్పడం పెద్ద అబద్ధం అని నజాఫీ అన్నారు. కాగా, నతాంజ్‌పై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ అంగీకరించ లేదు.
సాధారణంగానే రేడియేషన్ స్థాయులు..
ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడుల ఆరోపణలపై యూఎన్ (UN) అణు నిఘా సంస్థ అధిపతి రాఫెల్ స్పందించారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అణు కేంద్రాలపై దాడులు జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. టెహ్రాన్‌లో ఇప్పటి వరకు రేడియేషన్ స్థాయులు సాధారణం కంటే ఎక్కువ ఉన్నట్లు గుర్తించలేదని వివరించారు. అయినప్పటికీ ఆ ప్రాంతంలో దాడులు కొనసాగుతున్నందున రేడియేషన్ లీకేజ్ ని తోసిపుచ్చలేమని అన్నారు.
అణు కేంద్రాలపై దాడి జరిగి, రేడియేషన్ లీకేజీ అవుతున్నట్లు అయితే.. న్యూక్లియర్ ప్లాంట్ కు సమీపంలో ఉన్న ప్రజలను ఖాళీ చేయించే అవకాశం ఉందని రాఫెల్ అన్నారు. అణు కేంద్రాలపై దాడుల గురించి తెలుసుకోవడానికి ఇరాన్ అణు నియంత్రణ అధికారులను కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే, వారి నుంచి ఎటువంటి స్పందన లేదని వెల్లడించారు.
గత మూడు రోజులుగా మిడిల్ ఈస్ట్ లో వివాదం వేగంగా విస్తరించింది. ఇరాన్, ఇరాన్ మద్దతుగల గ్రూపుల దాడులు ఇజ్రాయెల్, గల్ఫ్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలను తాకాయి. ఇరాన్ లో ఇప్పటివరకు 555 మంది మరణించారని ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది. ఇజ్రాయెల్ దాడులు దక్షిణ లెబనాన్‌కు కూడా విస్తరించాయి. అక్కడ 31 మంది మరణించినట్లు సమాచారం.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా శనివారం ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌తో పాటు ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై దాడులు ప్రారంభించింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఖతమయ్యాడు. ఈ పరిణామం ఆ దేశాల మధ్య శత్రుత్వాన్ని మరింతగా పెంచింది.
Also Read: యుద్ధంలోకి మరికొన్ని దేశాలు.. చినికి చినికి వరల్డ్ వార్ అవుతుందా?
