కదలలేకనే దొరికిపోయాడా: 250కేజీల ISIS జిహాదీ అరెస్టు

ఇరాక్ ప్రత్యేక బలగాలు ఐసిస్ ఉగ్రవాదులకు సంబంధించిన పెద్ద తలనే పట్టుకున్నాయి. ఐసిస్‌లో క్లర్క్‌గా పనిచేసే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. దానికి కారణం ఆ వ్యక్తి 560పౌండ్ల బరువు అంటే(దాదాపు 250కేజీలు)కు పైగానే బరువు ఉన్నాడన్నమాట.
పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు కానీ, తరలించడానికి పోలీస్ కారు సరిపోలేదంట. చేసేది లేక ఓ ట్రక్ తీసుకొచ్చి అందులో కూర్చొబెట్టి తీసుకువెళ్లారు. ఇరాక్ బలగాల అధికారిక కథనం ప్రకారం.. మఫ్తీ అబూ అబ్దుల్ బరీ అనే వ్యక్తి సెక్యూరిటీ బలగాలకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేస్తూ.. ఐసిస్ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు.
అంతేకాదు ఐసిస్ నియమాలు ఒప్పుకోలేదని కొందరు ముస్లింలను కూడా చంపేయమంటూ ఆర్డర్లు ఇచ్చాడు. లండన్ కేంద్రంగా యాంటి ముస్లిం ఉగ్రవాద కార్యకర్త మాజిద్ నవాజ్ ఫేస్‌బుక్‌లో ఓ పెద్ద పోస్టు పెట్టాడు. పోలీసులు అతణ్ని పట్టుకున్నప్పటికీ భారీకాయంతో ఉండటంతో తరలించలేకపోయారని రాసుకొచ్చాడు.
‘సిరియన్లు, ఇరాకీయులు దీనికి సాక్ష్యంగా నిలిచారు. దేవుడు తమ వైపే ఉన్నాడని మారణకాండ సృష్టించి ఇస్లాం పేరు చెప్పుకుంటున్నారు. అతణ్ని సైకాలజికల్ గా తక్కువ అంచనా వేయొద్దు. అతని శరీరం అంచనాలకు అతీతంగా ఆదేశాలు ఇస్తుంది’ అని పోస్టు చేశాడు. మరో సోషల్ మీడియా పోస్టులో వేరొకరు ఆయన జిహాదిగా మారిపోయాడు. పవిత్రయుద్థం కోసం తనను తాను త్యాగం చేసుకున్నాడంటూ పోస్టు పెట్టాడు.