ఇరాక్‌లో జంట ఆత్మాహుతి దాడులు.. 13 మంది మృతి

Iraq Suicide attack : ఇరాక్ లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. దేశ రాజధాని నగరం సెంట్రల్ బాగ్దాద్ లోని ఓ మార్కెట్లో ఒకేసారి రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కనీసం 13 మంది మరణించినట్టు సమాచారం. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. సెంట్రల్ బాగ్దాద్ లోని టైయారన్ స్క్వెయిర్ లో రద్దీగా ఉన్న మార్కెట్లోకి ఇద్దరు తీవ్రవాదులు పేలుడు పదార్థాలను ధరించి ప్రవేశించినట్టు ఇరాకీ మిలటరీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఆత్మాహుతి దాడులకు పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులు ప్రవేశించి తమను తాము పేల్చేసుకున్నట్టు ఇరాక్ స్టేషన్ మీడియా నివేదించింది. ఆత్మాహుతి దాడుల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.


ఈ దాడికి బాధ్యులుగా ఏ ఉగ్రవాది సంస్థ ప్రకటించుకోలేదు. 2017లో ఇస్లామిక్ స్టేట్ పరాజయం తర్వాత నుంచి ఇక్కడ ఆత్మాహుతి దాడులు చాలావరకు జరగలేదు. అమెరికా మద్దతుతో ఇరాక్ మిలటరీ 2017లోనే తమ భూభాగంపై ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపును నియంత్రణలోకి తీసుకొచ్చింది.

ఆ తర్వాత ఇరాక్ రాజధానిలో బాగ్దాద్‌లో 2018 జనవరిలో టాయరన్ మార్కెట్లో బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 27 మంది మరణించారు. ఆ తర్వాతి ఏళ్లలో ఆత్మాహుతి దాడి జరగడం ఇదే తొలిసారి.