Rebirth Possible : పునర్జన్మ కోసం కోట్ల రూపాయల ఖర్చు

Rebirth Possible : జీవించాలని కోరుకునేవారిలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి.. ఇంతకీ మరణాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా? మరణం లేని జీవితం సాధ్యమా?

Rebirth Possible : మరణాన్ని జయించగలమా? మరణాంతరం మరో జన్మ ఉంటుందా? మరణం తప్పదని తెలిసినా.. మరు జన్మ కోసమో.. మరింత ఎక్కువ కాలం జీవించాలనో మనిషి ఆరాట పడటం సాధారణం… అంతంలేని జీవితం కోరుకోవడం అత్యాశే అయినా… శాస్త్రవేత్తల పరిశోధనలు శాశ్వతంగా జీవించాలని కోరుకునేవారిలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి.. ఇంతకీ మరణాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా? మరణం లేని జీవితం సాధ్యమా?

పుట్టిన ప్రతి జీవి మరణించకతప్పదు. మరణం నుంచి తప్పించుకోవడం ఇప్పటివరకు అసాధ్యమనే చెప్పాలి.. ఐతే ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగాలు మరణాన్ని జయించాలనుకునే వారిలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇన్నాళ్లు సినిమాల్లోనో… నాటకాల్లోనూ మాత్రమే మృత్యుంజయులను చూశాం.. మరణించిన వారి దేహంలో ఆత్మ పరకాయ ప్రవేశం చేయడాన్ని ఊహించుకున్నాం… నిజజీవితంలో అలాంటి ఊహాలకు ఎలాంటి ఆస్కారం ఉండదు… కానీ, ఆస్ట్రేలియాలోని ఓ ప్రయోగశాలలో క్రయోనిక్స్‌ కంపెనీ తన మొదటి క్లెయింట్‌ను మళ్లీ బతికించాలనే ఆలోచనతో కొత్త ప్రయోగానికి తెరలేపింది.

పునర్జన్మ కోసం దేహాలను భద్రపరుచుకుని.. :
పునర్జన్మ కోరుకునే వారు… లేదా మరణమే వద్దనుకునే వారు ఈ ప్రపంచంలో చాలా మందే ఉన్నారు. కొందరు భగవంతుడిపైనా… మరికొందరు వైద్యరంగంలో నిష్ణాతులైన శాస్త్రవేత్తల ద్వారా మరణం నుంచి తప్పించుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారే ఆస్ట్రేలియాలోని సదరన్‌ క్రయోనిక్స్‌ అనే కంపెనీ ద్వారా తమ దేహాలను భద్రపరుచుకుని పునర్జన్మ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా పేర్లు నమోదు చేసుకున్న వారిలో ఇటీవల మరణించిన ఆ కంపెనీ మొదటి కస్టమర్‌ మృతదేహాన్ని మైనస్‌ 200 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద భద్రపరిచారు క్రయోజనిక్‌ శాస్త్రవేత్తలు.

నమ్మశక్యం కాకపోయినా, ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రయోగం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. మరణించిన వ్యక్తిని బతికించడానికి శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? ఎలాంటి ఫలితం సాధిస్తారనేది యావత్‌ ప్రపంచం ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది. ఈ నెల 12న సిడ్నీలో ఓ ఆస్పత్రిలో క్రయోజనిక్స్‌ కంపెనీ పేషెంట్ వన్ మరణించాడు. అతని శరీరాన్ని తిరిగి బ్రతికించాలనే ఆశతో వెంటనే రంగంలోకి దిగారు శాస్త్రవేత్తలు. ముందుగా మరణించిన వ్యక్తి దేహం పాడైపోకుండా భద్రపరిచేదుకు 10 గంటలపాటు నిర్విరామంగా పనిచేశారు.

బతికితే ఆ దేహం పనికొస్తుందని.. :
పేషెంట్‌ వన్‌ మరణించిన వెంటనే అతడి మృతదేహాన్ని ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించి దాదాపు 6 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించేందుకు ఐస్‌లో ప్యాక్ చేశారు. అంతేకాకుండా శరీరంలో కణాలను సంరక్షించడానికి ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఒక రకమైన యాంటీ-ఫ్రీజ్‌గా పనిచేసే ద్రవాన్ని పంప్ చేశారు. ఇలా చేయడం వల్ల సదరు వ్యక్తి బతికితే ఆ దేహం పనికొస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. వాస్తవానికి ఫోరెనిక్స్‌ సైన్స్‌లోనూ మృతదేహాలను భద్రపరిచే విధానం ఉన్నా, కాస్త అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగంపై విస్తృత చర్చ జరుగుతోంది.

మరణించిన వ్యక్తి మళ్లీ బతుకుతాడో లేదో గాని… ఆస్ట్రేలియా ప్రయోగం మాత్రం వార్తల్లో నిలిచింది. వాక్యూమ్ స్టోరేజ్ పాడ్‌గా పనిచేసే ప్రత్యేక ట్యాంక్‌లో పేషెంట్‌ వన్‌ మృతదేహాన్ని భద్రపరిచిన తర్వాత ఆ వ్యక్తిని ఎలా బతికిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. నిజంగా ఆస్ట్నేలియా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం ఫలిస్తే… ఈ ప్రపంచంలో ఓ అత్యద్భుతం ఆవిష్కించినట్లే… సృష్టినే తిరిగిరాసినట్లే…. అందుకే అందరిలో అంత ఉత్సుకత… అంత ఉత్కంఠ..

Read Also : Kamineni Hospitals : దేశంలోనే ఫస్ట్ టైమ్.. పోలియో బాధితుడికి కామినేని ఆస్ప‌త్రిలో గుండెమార్పిడి విజయవంతం

ట్రెండింగ్ వార్తలు