పాకిస్థాన్‌లో టాప్ టెర్రరిస్ట్ ఖతం.. ఎవరు ‘చంపారో’ కానీ..

పాకిస్థాన్‌లో టాప్ టెర్రరిస్ట్ హతమయ్యాడు. జైష్-ఎ-మొహమ్మద్ (జెఈఎం) టాప్ కమాండర్ అబ్దుల్ అజీజ్ ఇసార్ మృతిచెందాడు.

పాకిస్థాన్‌లో టాప్ టెర్రరిస్ట్ ఖతం.. ఎవరు ‘చంపారో’ కానీ..

Updated On : June 3, 2025 / 12:28 PM IST

పాకిస్థాన్‌లో టాప్ టెర్రరిస్ట్ హతమయ్యాడు. జైష్-ఎ-మొహమ్మద్ (జెఈఎం) ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ అబ్దుల్ అజీజ్ ఇసార్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని పాకిస్థాన్ లోని పంజాబ్ జిల్లాలో గుర్తించారు. అబ్దుల్ అజీజ్ భారత వ్యతిరేూక ప్రసంగాలు చేయడంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి.

 

అజీజ్ మృతదేహాన్ని అతని సహాయకుడు మంగళవారం తెల్లవారు జామున గుర్తించాడు. ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న వర్గాల సమాచారం ప్రకారం.. అతను గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. అయితే, అతని మరణానికి కారణం ఇంకా అధికారికంగా నిర్ధారించబడలేదు. ఇప్పటి వరకు జేఈఎంకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల్లోని పోస్టుల్లో బుల్లెట్ గాయాలతో అతను మరణించాడనే వార్తలను తోసిపుచ్చాయి.

 

అబ్దుల్ అజీజ్ ఇసార్ పంజాబ్ ప్రావిన్స్ లోని భక్కర్ జిల్లా కల్లూర్ కోట్ ప్రాంతంలోని అప్రష్‌వాలా నివాసి. జైష్-ఎ-మొహమ్మద్ అగ్రనాయకత్వంలో కీలక వ్యక్తి. అతను చాలాకాలంగా భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. భారత దేశంలోని అనేక ఉగ్రవాద దాడులకు సూత్రధారి. బహవల్‌పూర్‌లోని జైషే ప్రధాన కార్యాలయం ‘మర్కజ్’లో అతని అంత్యక్రియలు జరుగుతాయని వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద సంస్థకు చెందిన ఇతర అగ్ర నాయకులు, ఉగ్రవాద సంస్థకు మద్దతుదారులు ఆయన అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం ఉంది.

జైషే ఉగ్రవాద సంస్థ భావజాలం పెంపొందించడంలో, ఉగ్రవాద నియామక కార్యక్రమాల్లో మౌలానా అజీజ్ కీలక పాత్ర పోషించినందున, అతని మరణం జైషేకు పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు. ఉగ్రవాద సంస్థల్లో అజీజ్ మరణం పెద్ద కలకలం సృష్టించింది.