ఎందుకీ ప్రపంచ బ్రెయిలీ డే? ఏంటీ గొప్పదనం?

  • Publish Date - January 4, 2020 / 07:42 AM IST

జనవరి 4 ప్రపంచ బ్రెయిలీ రోజు. అంధులకు ఆపద్భాంధవుడు లూయీ బ్రెయిలీ అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. జనవరి 4 1809లో లూయీ బ్రెయిలీ జన్మించారు. ప్రపంచ అంధులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ పుట్టిన రోజునే ఆయన పేరునే ప్రపంచ బ్రెయిలీ దినోత్సంగా రూపొందింది. అంధుల కళ్లల్లోను..జీవితాల్లోను  వెలుగులు నింపిన మహనీయుడు లూయీ బ్రెయిలీ. చీకటిని జయించిన తిమిర వీరుడు..లూయీ బ్రెయిలీ.

లూయీ బ్రెయిలీ పారిస్‌లోని క్రూవే గ్రామంలో 1809 జనవరి 4న తల్లిదండ్రులు మోనిక్‌ బ్రెయిలీ,సైమన్‌ రెనె బ్రెయిలీ లకు జన్మించారు. బాల్యంలో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి 4వ ఏట పూర్తిగా గుడ్డి వాడయ్యాడు. పారిస్‌లో 1784లో వాలెంటైన్‌ హ్యూ ప్రారంభించిన అంధుల పాఠశాలకు బ్రెయిల్‌ చదువు కోవడానికి వెళ్ళాడు. బ్రెయిల్‌ అసాధారణ ప్రతిభ సామర్థ్యాలు గల వ్యక్తిగా రాణించారు. ఆనాడు అమలులో ఉన్న ”లైన్‌ టైపు” పద్ధతిలో చదువుకుని 17 సంవత్సరాల వయస్సులోనే అదే స్కూలులో ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు.
 
అంధులకు చదువు చెప్పాలంటే వారికి ప్రత్యేకమైన పుస్తకాలు కావాలి. వారికి ప్రింటింగు పద్ధతిని కాకుండా ఎత్తుగా, ఉబ్బినట్లుగా ఉండినట్లుగా ఉండే అక్షరాల అవసరం ఉంది. స్పెయిన్‌ దేశానికి చెందిన ఫ్రాన్సిస్కో లూకాస్‌ 16వ శతాబ్దంలో చెక్కమీద ఎత్తుగా ఉబ్బిగా వుండే అక్షరాలను చెక్కే పద్ధతి రూపొందించాడు. 
అంధులకు చదువుకోవాలంటే పుస్తకాలు ఎలా ప్రింటు చేయాలన్న విషయంలో ఎక్కువగా కృషి చేసింది అంధులే. ఎందుకంటే అంధుల కష్టం అంధులకే తెలుస్తుంది. ఎన్నో ప్రయోగాలు అనంతరం చాలాకాలానికి  అంధుల లిపిని రూపొందించడానికి అనేకమంది అంధులు కృషి చేశారు. వారు చెక్కబోర్డు మీద పుస్తకాలు తయారు చేయాలని ప్రయత్నించారు. అయితే మొట్టమొదటి సారిగా పారదస్‌ అనే అంధుడు..అతని స్నేహితుడు హెయిలీ కలిసి పేపరు మీద ఎత్తుగా ప్రింటు చేసే విధానం రూపొందించారు. 

1784లో ఇది కనుగొన్న ఘనత లూయి బ్రెయిలీకి దక్కింది. తరువాత ఎంతోమంది దీన్ని పరిశోధన చేశారు. అయితే అవి అంధులు చదువు నేర్చుకొనడానికి అంత సులభంగా వుండేవికావు. ఆధునిక యుగంలో అంధుల పుస్తకాలన్నీ బ్రెయిల్‌ పద్ధతిలో ఉండటం ఎంతో గర్వకారణం. దీనిని కనుగొన్న వ్యక్తి లూయీ బ్రెయిలీ. తన పరిశోధన ద్వారా విప్లవాత్మకమైన మార్పులను సాధించి అంధుల పాలిట అక్షర శిల్పి అయ్యారు.

అంధులు సులువుగా చదువుకోవడం కోసం ఏదైనా చేయాలని పరితపించారు బ్రెయిలీ. పగలు ప్రెఫెసర్ గా పనిచేస్తూ..రాత్రిళ్లు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకి కృషిచేశాడు. అక్షరాలు నున్నగా కాకుండా చుక్కలు చుక్కులుగా ఉండాలని లూయీ భావించాడు. 1821లో చార్లెస్‌ బార్బియర్‌ అనే సైనిక అధికారి చీకట్లోనూ తన సైనికులు తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 చుక్కల సంకేత లిపిని తయారుచేసాడని తెలుసుకున్న లూయిస్‌ 12 చుక్కలను ఆరు చుక్కలకు కుదించి అవసరమైన రీతిలో అక్షరాలను, పదాలను, సంగీత గుర్తులను చదివేలా ఉబ్బెత్తు అక్షర లిపిని రూపొందించాడు. ఇలా ఈ నిరంతరంగా శ్రమించారు. దీంతో క్షయవ్యాధికి గురై 1852 జనవరి 6న మరణించాడు. లూయీ బ్రెయిలీ మరణించినా..అంధుల అక్షరాలలో జీవించే ఉన్నారు. వారి ప్రతిభా పాటవాలలో లూయీ బ్రెయిలీ చిరంజీవిగా నిలిచే ఉన్నారు. ఎప్పటికీ ఉంటారు. భాష ఏదైనా..దేశం ఏదైనా  ప్రపంచంలోని అంధులకు ఆయనే ‘అక్షర శిల్పి’.