Justin Trudeau: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై కెనడియన్లలో తీవ్ర వ్యతిరేకత.. ప్రతిపక్ష హోదాకూడా కష్టమే..!

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికిప్పుడు ఆ దేశంలో ఎన్నికలు జరిగితే ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఓ సర్వే సంస్థ పేర్కొంది.

Justin Trudeau: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై కెనడియన్లలో తీవ్ర వ్యతిరేకత.. ప్రతిపక్ష హోదాకూడా కష్టమే..!

Justin Trudeau

Updated On : December 30, 2024 / 2:58 PM IST

Justin Trudeau: ఇండియాపై అసత్య ఆరోపణలు చేస్తూ కయ్యానికి కాలుదువ్విన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు సొంత దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ట్రూడో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కెడియన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ట్రూడో మంత్రి వర్గంలో కీలక నేతలు రాజీనామాలు చేస్తుండటంతో ఆయన ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రూడో రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా వచ్చే ఏడాది అక్టోబర్ నెలలో కెనడా పార్లమెంటరీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆలస్యమైతే మరీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన ట్రూడో.. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ సర్వే సంస్థ ట్రూడో పాలన పట్ల కెనడియన్లు ఏమంటున్నారని సర్వే నిర్వహించగా.. ఆయన పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెల్లుబికుతున్నట్లు తేలింది.

Also Read: 2024 Main Headline News : 2024లో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన హెడ్‌లైన్స్‌గా నిలిచిన ఆసక్తికరమైన సంఘటనలు, విశేషాలివే..!

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. తన కేబినెట్ లో కీలక వ్యక్తిగా కొనసాగిన ఆ దేశ ఉప ప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రూడో కేబినెట్ లో అత్యంత శక్తిమంతురాలిగా క్రిస్టియా ఫ్రీలాండ్ కు గుర్తింపు ఉంది. అయితే, లిబరల్ పార్టీ సభ్యురాలిగా కొనసాగుతానని, తదుపరి ఎన్నికల్లో టొరంటో నుంచి మళ్లీ పోటీ చేస్తానని ఆమె పేర్కొంది. అయితే, ఫ్రీలాండ్ తన పదవికి రాజీనామా తరువాత సొంత పార్టీలో ఎంపీల నుంచి ట్రూడోపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మూడో వంతు మంది ఎంపీలు ట్రూడోపై వ్యతిరేకతతో ఉన్నారు. మరోవైపు ట్రూడోకు ఖలిస్థానీ మద్దతుదారు, నేషనల్ డెమోక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) నేత జగ్మీత్ సింగ్ సైతం షాకిచ్చాడు. ప్రధాని పదవికి ట్రూడో రాజీనామా చేయాలంటూ ఆయన ఇటీవల డిమాండ్ చేశారు. జస్టిన్ ట్రూడో ఎన్డీపీ మద్దతుతోనే చాలాకాలంగా మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎన్డీపీ కూడా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. తద్వారా ట్రూడో లిబరల్ పార్టీని సంక్షోభంలో పడేసింది.

Also Read: China Biggest Dam On Brahmaputra : భారత్ మీద మరో భారీ కుట్ర చేస్తున్న చైనా? బ్రహ్మపుత్ర నదిపై భారీ ప్రాజెక్ట్ నిర్మాణం అందుకేనా..!

కెనడా ప్రధానమంత్రి పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేయాలని మూడింట రెండొంతుల మంది కెనడియన్లు కోరుకుంటున్నారని లెగర్ సర్వేలో స్పష్టమైంది. నేషనల్ పోస్టు ప్రకారం.. టూడ్రో రాజీనామా చేయాలని 69శాతం మంది కెనడియన్లు కోరుకుంటున్నారని సర్వేలో తేలిందట. లిబరల్ పార్టీలో ట్రూడోపై పలువురు ఎంపీల తిరుగుబాటు, ప్రభుత్వంపై కెనడియన్లలో అసంతృప్తి పెరుగుతున్న సమయంలో సర్వే ఫలితాలు వచ్చాయి. సర్వే ప్రకారం.. జస్టిన్ ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీకి కెనడియన్ల మద్దతు గతంలో ఎప్పుడూలేని విధంగా తగ్గింది. సీబీసీ న్యూస్ పోల్ ట్రాకర్ లో తాజా ఫలితాల ప్రకారం.. కన్జర్వేటివ్ పార్టీకి 44శాతం మంది ప్రజలు మద్దతు తెలుపగా.. ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీకి 20.9 శాతం మంది మాత్రమే మద్దతు ఇచ్చారు. జగ్మీత్ సింగ్ న్యూడెమోక్రటిక్ పార్టీ (ఎన్డీపీ)కి 19శాతం మంది కెనడియన్లు మద్దతు తెలిపారు. దీంతో ఎన్డీపీ కంటే అధికార లిబరల్ పార్టీ స్వల్ప ఆధిక్యంలోనే ఉండటం గమనార్హం.

Also Read: Koneru Humpy : ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ విజేత‌గా కోనేరు హంపీ

ప్రస్తుతం పోల్ ఫలితాల ప్రకారం.. ఎన్నికలు జరిగితే లిబరల్ పార్టీకి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. బ్లాక్ క్యూబెకోయిస్ లేదా ఎన్డీపీ ప్రతిపక్ష పాత్రను పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, వచ్చే ఏడాది అక్టోబర్ వరకు వేచిఉంటే ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న ట్రూడో.. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కెనడాలోని 337 మంది సభ్యుల పార్లమెంట్ లో లిబరల్ పార్టీ ఎంపీలు 153 మంది ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ అయిన కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు 120 మంది, ఎన్డీపీ 25, బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీకి చెందిన 33 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఉన్నారు.