ఒక్క రోజు కూడా పని చేయకుండా కంపెనీ నుంచి రూ.26 లక్షల శాలరీ తీసుకున్న యువకుడు.. ఎలాగంటే?

కోర్టులో ఏం జరిగింది?

ఒక్క రోజు కూడా పని చేయకుండా కంపెనీ నుంచి రూ.26 లక్షల శాలరీ తీసుకున్న యువకుడు.. ఎలాగంటే?

Updated On : June 21, 2025 / 6:41 PM IST

ఉద్యోగానికి తీసుకున్నారు, కానీ ఒక్క రోజు కూడా పనికి పిలవలేదు… పైగా జీతం కూడా ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే చాలామంది నిరాశ చెందుతారు. కానీ, అబుదాబిలో ఓ వ్యక్తి మాత్రం వెనక్కి తగ్గలేదు. తన హక్కుల కోసం న్యాయపోరాటం చేసి, కంపెనీ నుంచి ఏకంగా 110,400 దిర్హమ్స్ (భారత కరెన్సీలో సుమారు రూ. 26 లక్షలు) పరిహారం పొందాడు. ఈ కేసు వివరాలు ఇప్పుడు చూద్దాం.

అసలు ఏం జరిగింది? 

ఓ వ్యక్తిని ఒక కంపెనీ ఉద్యోగంలోకి తీసుకుంది, కానీ అతడితో పని చేయించడానికి అనుమతించలేదు.

అతని కాంట్రాక్ట్ ప్రకారం

బేసిక్ శాలరీ: 7,200 దిర్హమ్స్ (సుమారు రూ.1.70 లక్షలు)

మొత్తం నెల జీతం: 24,000 దిర్హమ్స్ (సుమారు రూ.5.65 లక్షలు)

అయితే, కంపెనీ అతనికి పని అప్పగించకుండా, జీతం చెల్లించకుండా అతని జాయినింగ్ తేదీని పదేపదే వాయిదా వేస్తూ వచ్చింది. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు.

కోర్టులో ఏం జరిగింది?

కంపెనీ యజమాని వాదన ప్రకారం.. ఆ ఉద్యోగి విధులకు హాజరు కాలేదని, సెలవు తీసుకున్నాడని పేర్కొన్నాడు. కానీ, ఈ వాదనను నిరూపించడానికి కంపెనీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు తేల్చింది.

యూఏఈ కార్మిక చట్టం ప్రకారం ఉద్యోగి జీతం అనేది అతని హక్కు. సరైన కారణం లేకుండా దాన్ని ఆపలేరు. దీని ఆధారంగా కోర్టు ఉద్యోగికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఉద్యోగి అంగీకరించిన 8 రోజుల సెలవును మినహాయించి, మిగిలిన నాలుగు నెలల 18 రోజుల జీతాన్ని వెంటనే చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.

పని చేయకుండానే 14 ఏళ్ల జీతం: స్పెయిన్‌లో ఉద్యోగి మోసం

గతంలో ఇలాంటిదే మరో ఆశ్చర్యకరమైన సంఘటన స్పెయిన్‌లో జరిగింది. అయితే, ఇక్కడ మాత్రం తప్పు చేసింది కంపెనీ కాదు ఉద్యోగి. జోక్విన్ గార్సియా అనే ప్రభుత్వ ఉద్యోగి 14 సంవత్సరాలపాటు ఒక్క రోజు కూడా పనికి వెళ్లకుండానే పూర్తి జీతం అందుకున్నాడు.

జోక్విన్ గార్సియాకు 69 ఏళ్లు. 1996 నుంచి ఆయన మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని పర్యవేక్షించే ఉద్యోగంలో ఉన్నారు. అయితే, ఆయన ఏళ్ల తరబడి ఆఫీసు మొహం కూడా చూడలేదు. 2010లో సుదీర్ఘకాలం నమ్మకంగా సేవ చేసినందుకు గార్సియాకు అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు అసలు విషయం బయటపడింది.

అప్పటి డిప్యూటీ మేయర్ జార్జ్ ఫెర్నాండెజ్ ఈ విషయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. “అతను ఇంకా జీతం తీసుకుంటున్నాడు. అసలు ఈ మనిషి ఎక్కడ ఉన్నాడు? రిటైర్ అయిపోయాడా? లేక చనిపోయాడా? అని నేను ఆలోచించాను” అని మీడియాకు తెలిపారు. ఈ సంఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.