స్లో అవుతున్న ఆ సముద్ర ప్రవాహం.. మానవాళికి ముప్పు

ఊహించని విధంగా పర్యావరణ విపత్తులు తలెత్తుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Melting Antarctic ice sheets

పర్యావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో పెను విధ్వంసం తప్పదని శాస్త్రవేత్తలు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. వారు హెచ్చరిస్తున్నట్లుగానే పలు పరిణామాలు సంభవిస్తున్నాయి. ధ్రువాల వద్ద మంచు వేగంగా కరిగిపోతుండడంతో పెను ముప్పు పొంచి ఉందని తాజాగా మరో అధ్యయనంలో తేలింది.

అంటార్కిటికాలో సముద్ర ప్రవాహం కొన్ని సంవత్సరాలుగా తగ్గుతోందని ఆ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. అంటార్కిటిక్‌ సర్కంపొలార్‌ కరెంట్‌ ప్రవాహ తీరులో మార్పులపై యూనివర్సిటీ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ పరిశోధన చేసి ఈ వివరాలు వెల్లడించింది.

ప్రపంచంలో వాతావరణ క్రమబద్ధీకరణకు ఆ ప్రవాహం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే, మహా సముద్రాల ప్రవాహాల తీరు సైతం దీనిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ పరిస్థితి ఇలాగే దిగజారితే మనుషులకు ఊహించని విధంగా పర్యావరణ విపత్తులు తలెత్తుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Also Read: 4 రోజులుగా తగ్గి.. ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయిన బంగారం, వెండి ధరలు

అంటార్కిటికా ప్రపంచ పర్యావరణ సమతుల్యతను కాపాడుతోంది. ప్రపంచంలో అత్యంత బలమైన సముద్ర ప్రవాహం ఇక్కడిదే. ఈ ప్రవాహం పశ్చిమ దిశ నుంచి తూర్పుగా అంటార్కిటికా మహాసముద్రం పొడవునా సాగుతుంది.

మనుషుల మనుగడకు ఇది అత్యంత కీలకం. అయితే, పర్యావరణ మార్పుల వల్ల ఇక్కడి మంచు కొన్ని సంవత్సరాలుగా చాలా వేగంగా కరుగుతూ వస్తోంది. ఈ కారణంగా మంచి జలరాశి సముద్రంలోకి వెళ్లిపోతోంది.

దీంతో ఈ మహా సముద్రంలో లవణీయతతో పాటు నీటి సాంద్రత విషయంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సూపర్‌ కంప్యూటర్‌ జీఏడీఐను వాడుతూ శాస్త్రవేత్తలు సముద్ర ప్రవాహాల్లో మార్పులను గుర్తించి ఈ వివరాలు చెప్పారు.

అంటార్కిటిక్‌ సర్కంపొలార్‌ కరెంట్‌ మహాసముద్రాలన్నింటికీ కన్వేయర్‌ బెల్ట్‌లా పనిచేస్తుందని, దాని ప్రవాహ గతిలో మార్పులు ఇలాగే కొనసాగితే మానవాళి ఎదుర్కొనే విపరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. సముద్ర జలాల్లో లవణీయత భారీగా తగ్గుతుందని, గ్లోబల్‌ వార్మింగ్‌ మరింత పెరిగిపోతుందని చెప్పారు. జీవావరణ వ్యవస్థ బాగా దెబ్బ తింటుందని అన్నారు.