ఈ 10 రోజులే కరోనాకు కీలకం : మే వరకు లాక్‌డౌన్ పొడిగించనున్న బ్రిటన్

ప్రపంచ దేశాలను కరోనా పట్టిపీడిస్తోంది. కరోనా బారినుంచి దేశ ప్రజలను కాపాడాల్సిన బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్ వైరస్ సోకింది. ఆయన ప్రస్తుతం వైరస్ సోకి లండన్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఆస్పత్రి నుంచే ఆయన అన్ని విషయాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని పూర్తిగా కోలుకునే వరకూ ఫస్ట్ సెక్రటరీగా ఉన్న Dominic Raab బ్రిటన్ ప్రభుత్వ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. బ్రిటన్‌లో కరోనా విజృంభించడంతో ఏడు వేలకు పైగా మృతిచెందారు. 60వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాను కట్టడి చేసేందుకు బ్రిటన్ లాక్ డౌన్ విధించింది. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగాల్సి ఉంది.
ఇప్పటికీ కరోనా కొత్త కేసులు వేలల్లో నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎత్తివేస్తే మరింత ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని భావిస్తోంది బ్రిటన్ మంత్రివర్గం. ఏప్రిల్ 18 వరకు కరోనా వైరస్ తీవ్రత పీక్ స్టేజీలో ఉంటుంది.. ఈ 10 రోజుల వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా అభిప్రాయపడుతున్నారు. తనకు వైరస్ సోకకు ముందే ప్రధాని బోరిస్ జాన్సన్ ఏప్రిల్ 13, ఈస్టర్ మండే (సోమవారం) రోజున కరోనా లాక్ డౌన్‌పై రివ్యూ చేస్తామన్నారు. కానీ, డౌనింగ్ స్ట్రీట్‌లో పరిస్థితి ప్రమాదకరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడి ప్రజలు సలహాలను వినే పరిస్థితుల్లో లేరు. లాక్ డౌన్ సడలిస్తే.. వేలాది మందిని పొగట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురువుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. (ఈ మేలు మరువం…భారత్ కు థ్యాంక్స్ చెప్పిన ట్రంప్)
దీనిపై సెక్రటరీ Raab అధ్యక్షతన కోబ్రా మీటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ మే నెల వరకు పొడిగింపుపై చర్చించనున్నారు. బ్రిటన్లు మరికొద్ది వారాలు లాక్ డౌన్ కు సహకరించాలని, సాధ్యమైనంతవరకు అందరూ ఇంట్లోనే ఉండాల్సిందిగా ఆయన సంకేతాలివ్వనున్నారు. మూడు వారాల డేటాను విశ్లేషించిన తర్వాత వచ్చే వారం ప్రభుత్వం అధికారికంగా లాక్ డౌన్ పొడిగించనుంది. మరోవైపు లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. దీనిపై మంత్రివర్గంలో టెన్షన్లు మొదలయ్యాయి. కానీ, ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ.. మే వరకు లాక్ డౌన్ పొడిగింపుపై అభ్యంతరం వ్యక్తం చేసే ప్రసక్తే లేదన్నారు.
కరోనా వైరస్ మరింత తీవ్ర స్థాయికి చేరుకునే సమయం ఇది. ఈ పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహిస్తే విపత్కర పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు. ఈ రోజుకు రోజువారీ కరోనా మరణాల రేటు 938కి చేరింది. సామాజిక దూరం, ఇంట్లోనే ఉండటం పనిచేయడం ద్వారా కరోనాను ఎదుర్కొవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ఈస్టర మండే తర్వాత స్కూళ్లు ఓపెన్ చేయొద్దని మంత్రి సూచించారు.