చంద్రుడిపై పరిశోధనల్లో మరో ముందడుగు.. 130 మీటర్ల లోతులో భారీ గుహ

చంద్రునిపై ఉన్న ఈ గుహలలో రాబోయే 20 నుంచి 30 ఏళ్లలో మనుషులు నివసించే అవకాశం ఉందంటున్నారు సైంటిస్టులు. వ్యోమగాములు లోపలికి వెళ్లడానికి, బయటికి రావడానికి జెట్ ప్యాక్స్‌ లేదా లిఫ్ట్‌ను వాడాల్సి ఉంటుందని చెబుతున్నారు.

Italian Scientists find underground cave on moon

cave on moon: మూన్ మిషన్‌లో రోజుకో అడుగు ముందుకు పడుతోంది. చంద్రుడిపై పరిశోధనల్లో ప్రపంచ దేశాలు ఒక్కో అడుగు ముందుకేస్తున్నాయి. ఇటలీ సైంటిస్టులు చంద్రుడిపై తొలిసారి ఓ గుహను కనుగొన్నారు. ఈ గుహ దాదాపు 130 మీటర్ల లోతు ఉన్నట్లు అంచనా వేశారు. చంద్రుడిపై మానవులు శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసేందుకు ఇదొక అనువైన ప్రదేశం కాబోతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది కేవలం ఒక గుహ మాత్రమేనని, ఇలాంటివి చంద్రుడి ఉపరితలం మీద వందల కొద్దీ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు సైంటిస్టులు. చంద్రుడిపై మనుషుల కోసం శాశ్వత నివాసాల ఏర్పాటుకు పలు దేశాలు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ రేడియేషన్, తీవ్ర ఉష్ణోగ్రతలు, అంతరిక్ష వాతావరణం నుంచి వ్యోమగాములకు రక్షణ వంటి సమస్యలతో.. జాబిల్లి మీద శాశ్వత నివాసాల ఏర్పాటు కుదరడం లేదు.

ఇప్పుడు కనుగొన్న గుహ మానవ ఆవాసాలకు అనువైన ప్రదేశంగా కనిపిస్తోందని అంటున్నారు శాస్త్రవేత్తలు. చంద్రునిపై ఉన్న ఈ గుహలలో రాబోయే 20 నుంచి 30 ఏళ్లలో మనుషులు నివసించే అవకాశం ఉందంటున్నారు. ఈ గుహ చాలా లోతుగా ఉందని అన్నారు. వ్యోమగాములు లోపలికి వెళ్లడానికి, బయటికి రావడానికి జెట్ ప్యాక్స్‌ లేదా లిఫ్ట్‌ను వాడాల్సి ఉంటుందని చెబుతున్నారు.

గుంతల్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం..
ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ ట్రెంటో‌కు చెందిన లొరెంజో బ్రుజోన్, లియోనార్డో కారర్‌ ఈ గుహను గుర్తించారు. రాడార్‌ను ఉపయోగించి ఇక్కడున్న గుంతల్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా వారికి ఈ గుహ కనిపించింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో సముద్రం ఉండేదని భావిస్తున్నారు. కొన్ని ప్రత్యేక ఎక్విప్‌మెంట్‌తో భూమిమీద నుంచి చూస్తే మనిషి కంటికి కూడా ఈ గుహ కనిపిస్తుందని అంటున్నారు. 1969లో అపోలో 11 నౌక ఇక్కడే దిగింది. ఈ గుహ చంద్రుని ఉపరితలంపై వర్టికల్‌గా, వేలాడదీసిన గోడలాగా ఉంది. చంద్రగర్భంలో ఈ గుహ మరింత విస్తరించే అవకాశం కూడా ఉంటుంది. లక్షల, కోట్ల సంవత్సరాల కిందట చంద్రునిపై లావా ప్రవహించినప్పుడు, రాయి ద్వారా సొరంగం ఏర్పడి ఉండొచ్చంటున్నారు ఎక్స్‌పర్ట్స్.

గుహలకు ప్రవేశ మార్గాలు!
భూమిపై గుహలలోనే జీవం ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో చంద్రునిపై ఉన్న గుహలలో కూడా మనుషులు జీవించే అవకాశం ఉంటుంది. ఈ గుహను ఇంకా పూర్తిగా స్టడీ చేయాలని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఉపరితలాన్ని లోతుగా పరిశీలించే రాడార్లు, కెమెరాలు, రోబోలను వాడి వీటిని మ్యాప్ చేయొచ్చని భావిస్తున్నారు. చంద్రునిపై గుహలు ఉండొచ్చని దాదాపు 50 ఏళ్ల కిందట శాస్త్రవేత్తలు భావించారు. ఆ తర్వాత 2010లో లూనార్ రీకన్నియసాన్స్ ఆర్బిటర్ అనే మిషన్ చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతూ అపోలో మిషన్లు దిగిన ప్రదేశాలను ఫోటోలు తీసింది. ఈ ఫోటోలలో గుంతలు కనిపించాయి. ఇవి గుహలకు ప్రవేశ మార్గాలు కావొచ్చని అప్పట్లోనే శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే, గుహలు ఎంత లోతులో ఉన్నాయో అప్పుడు శాస్త్రవేత్తలకు తెలియదు. ప్రస్తుతం ఇటలీ ప్రొఫెసర్లు బ్రుజోన్, కారర్‌లు ఈ గుహ 130మీటర్ల లోతు ఉంటుందని చెబుతున్నారు. గుహల గురించి పూర్తిగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read : భారత్ పై భారీ దాడికి చైనా ప్లాన్ చేస్తుందా.. 13వేల అడుగుల ఎత్తులో రహస్య స్థావరం

చంద్రుని ఉపరితలంపై 20 సెం.మీ. రెజుల్యూషన్ వరకు తీసిన ఫోటోలు తమ దగ్గర ఉన్నాయంటున్నారు ఇటలీ ప్రొఫెసర్లు. అపోలో మిషన్లు దిగిన ప్రదేశాలను చూశారు. కానీ, ఉపరితలం కింద ఏముందో తెలియదని.. వాటిని కనుగొనేందుకు చాలా అవకాశాలు ఉన్నాయనేది వాళ్ల అంచనా. భవిష్యత్‌లో అంగారకుడిపై గుహలను కనుగొనేందుకు కూడా ఈ పరిశోధన ఉపయోగపడనుందని, అక్కడ మానవాళి జీవనంపై ఆధారాలను వెతికేందుకు ఇదొక మార్గం అవుతుందని అంటున్నారు ఇటలీ శాస్త్రవేత్తలు.

ట్రెండింగ్ వార్తలు