పాకిస్తాన్‌లో బలూచిస్తాన్‌ వేర్పాటువాద ఉగ్రవాదుల వరుసదాడులు.. 70 మందిపైగా మృతి

పౌరులు, భద్రతా సిబ్బంది, ప్రభుత్వ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిన వేర్పాటువాదులు ఇప్పుడు వ్యూహం మార్చినట్టు కనబడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పాకిస్తాన్‌లో బలూచిస్తాన్‌ వేర్పాటువాద ఉగ్రవాదుల వరుసదాడులు.. 70 మందిపైగా మృతి

Balochistan attacks : పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్ వరుస దాడులతో అట్టుకుతోంది. వేర్పాటువాద ఉగ్రవాదుల నరమేధంలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జరిగిన దాడుల్లో కనీసం 74 మంది చనిపోయారని అల్ జజీరా వార్తా సంస్థ వెల్లడించింది. ఈ దాడులు తామే చేశామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ప్రకటించుకుంది. పాకిస్తాన్‌ సైన్యం చేసిన సెర్చ్ ఆపరేషన్‌లో 21 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అటు మిలిటెంట్లు, ఇటు సైన్యం దాడులతో బలూచిస్తాన్‌ వాసులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారు.

బలూచిస్తాన్‌ స్వయంప్రతిపత్తి లక్ష్యంగా వేర్పాటువాద ఉగ్రవాదులు ఎంతో కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మరోసారి ఆరు చోట్ల దాడులకు తెగబడ్డారు. బలూచిస్తాన్‌లోని ముసాఖెల్ జిల్లా రాషామ్ ప్రాంతంలో హైవేను తమ అధీనంలోకి తీసుకుని బస్సులు, ట్రక్కులను అడ్డుకున్నారు. ప్రయాణికులు, డ్రైవర్లను కిందకు దించేసి.. పంజాబ్, ఖైబర్ పంఖ్తున్వా ప్రావిన్స్‌కు చెందిన 23 మందిని చంపేశారని స్థానిక పోలీసులు తెలిపినట్టు అల్ జజీరా వెల్లడించింది.

బలూచిస్తాన్‌ క్వెట్టాకి దక్షిణంగా 140 కిలోమీటర్ల ఉన్న ఖలాట్ జల్లాలో ఆరుగురు పోలీసులతో పాటు 11 మందిని ఉగ్రవాదులు బలితీసుకున్నారు. క్వెట్టాకు ఆగ్నేయంగా ఉన్న బోలాన్ జిల్లాలోని డొజాన్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో పంజాబ్‌కు చెందిన నలుగురు సహా ఆరుగురు వ్యక్తులు మరణించారు. పాకిస్తాన్, ఇరాన్ దేశాలను కలిపే రైలు మార్గంపై ఉన్న బ్రిడ్జిని కూడా పేల్చేశారు. బలూచిస్తాన్‌ వ్యాప్తంగా జరిగిన దాడుల్లో ఐదుగురు భద్రతా సిబ్బందితో పాటు 14 మంది ప్రాణాలు కోల్పోయినట్టు పాకిస్తాన్ ఆర్మీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

పౌరులు, భద్రతా సిబ్బంది, ప్రభుత్వ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిన వేర్పాటువాదులు ఇప్పుడు వ్యూహం మార్చినట్టు కనబడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పంజాబ్‌కు సమీపంలోని హైవేలను దిగ్బంధించడం, రైల్వే ట్రాకులను పేల్చివేయడం ద్వారా తమ ఉద్దేశాన్ని చాటారని చెబుతున్నారు. తమ పోరాటాన్ని పంజాబ్ వరకు విస్తరించాలని భావిస్తున్నట్టుగా కనబడుతోందని పాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ స్టడీస్ (PIPS) డైరెక్టర్ ముహమ్మద్ అమీర్ రానా అల్ జజీరాతో అన్నారు. పాకిస్తాన్‌లో అత్యంత సంపన్నమైన, అత్యంత రాజకీయంగా ఆధిపత్యం కలిగిన పంజాబ్ ప్రావిన్స్‌ను టార్గెట్ చేయడం ద్వారా తమ ఉనికి బలంగా చాటాలని వేర్పాటవాదులు ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతోందన్నారు. చైనా జాతీయులు, ప్రావిన్స్‌లోని ప్రాజెక్టులపై గతంలో జరిగిన పలు దాడులతోక బయటి వ్యక్తులకు బలూచిస్థాన్‌ సురక్షితం కాదనే మెసేజ్ ఇచ్చినట్టుగా కనబడుతోందన్నారు.

Also Read: యుక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర దాడి.. ఎన్ని క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించారో తెలుసా?

బలూచిస్తాన్‌ వేర్పాటవాదులు.. చైనీయులతో పాటు పాకిస్తాన్ భద్రతా బలగాలు, పంజాబీ కార్మికులు, అభివృద్ధి ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కార్మికులను లక్ష్యంగా చేసుకున్నారని వాషింగ్టన్, DCలో ఉన్న బలూచిస్తాన్ నిపుణుడు మాలిక్ సిరాజ్ అక్బర్ వెల్లడించారు. బలూచిస్తాన్‌ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేవారిని అడ్డుకునేందుకే వేర్పాటువాదులు ఇదంతా చేస్తున్నారని సిరాజ్ అభిప్రాయపడ్డారు.

బుగ్తీ 18వ వర్ధంతి సందర్భంగా..
బలూచిస్తాన్‌ మాజీ జాతీయవాద నాయకుడు నవాబ్ అక్బర్ బుగ్తీ 18వ వర్ధంతి సందర్భంగా తాజా దాడులు జరిగాయి. బలూచిస్థాన్ గవర్నర్, ముఖ్యమంత్రిగా పనిచేసిన బుగ్తీ 2005లో వేర్పాటువాద ఉద్యమంలో చేరారు. 2006, ఆగస్టులో అతని స్వస్థలమైన డేరా బుగ్తీకి సమీపంలో పాకిస్తాన్ సైనిక దాడిలో ఆయన మరణించారు. బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో వేర్పాటువాద సాయుధ సమూహాల ప్రభావం విస్తరించి ఉందని, ఇది ప్రభుత్వ అధికారాన్ని సవాలు చేస్తోందని అని అక్బర్ అల్ జజీరాతో అన్నారు.

పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్‌గా బలూచిస్తాన్‌ గుర్తింపు పొందింది. 2023 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ కోటిన్నర మంది నివసిస్తున్నారు. సహజ వనరుల సంపదకు నిలయమైన బలూచిస్తాన్‌.. చమురు, బొగ్గు, బంగారం, రాగి, గ్యాస్ నిక్షేపాలకు పెట్టింది పేరు. అయినప్పటికీ అత్యంత వెనుకబడిన ప్రాంతంగానే మిగిలిపోయింది.

చైనా ఖండన
బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో వేర్పాటువాద ఉగ్రవాద దాడులను చైనా ఖండించింది. పాకిస్తాన్ ప్రభుత్వానికి అండగా ఉంటామని ప్రకటించింది.