NASA: చంద్రుని దక్షిణ ధృవంపైకి వ్యోమగాములు.. వారు నివసించేందుకు ఇళ్లు కూడా..!

నాసా.. 2040 నాటికి చంద్రుడిపై మనుషుల కోసం ఇళ్లు నిర్మించే ప్రణాళిక రూపొందించింది. త్రీడీ ఇళ్ల నిర్మాణాల కోసం ఏర్పాట్ల బాధ్యతలను పలు కంపెనీలకు అప్పగించింది నాసా.

NASA: చంద్రుని దక్షిణ ధృవంపైకి వ్యోమగాములు.. వారు నివసించేందుకు ఇళ్లు కూడా..!

NASA plans to build homes for humans on the moon by 2040

Updated On : October 4, 2023 / 2:20 PM IST

NASA- Moon: చంద్రుడిపై ఉన్న రహస్యాలను తెలుసుకునేందుకు చాలా దేశాలు తహతహలాడుతున్నాయి. అందులో భాగంగానే చంద్రయాన్-3ని చంద్రుడి దక్షిణ ధృవంపైకి పంపిన ఇస్రో అందులో సక్సెస్ అయ్యింది. ఓవైపు జాబిల్లిపై పరిశోధనలు జరుగుతుండగానే.. నాసా మరో అడుగు ముందుకేసింది. ఏకంగా అక్కడ వ్యోమగాములు నివసించేందుకు అవసరమైన ఇండ్లను నిర్మించే ఏర్పాట్లు చేస్తోంది. 2040 నాటికి అక్కడ ఇళ్లు కట్టేందుకు అవసరమైన త్రీడీ ప్రింటర్‌ను వచ్చే ఏడాది చంద్రుడిపైకి పంపేందుకు సిద్ధమవుతోంది నాసా.

భారత్‌తో పాటు చాలా దేశాల్లోని అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇప్పటికే చంద్రునిపై పలు అధ్యయనాలు జరిపాయి. అక్కడ మానవ జీవనానికి అనువైన వాతావరణం అక్కడ ఉందా? లేదా? అనే విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ వ్యోమగాములు చంద్రుడిపైకి వెళ్లి రావడమే గానీ అక్కడ ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. దానికి కారణం వారు ఎక్కువ రోజులు అక్కడ ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు లేకపోవడమే.

ఈ క్రమంలోనే ఒక అడుగు ముందుకేసిన నాసా.. 2040 నాటికి చంద్రుడిపై మనుషుల కోసం ఇళ్లు నిర్మించే ప్రణాళిక రూపొందించింది. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది. చంద్రుడి ఉపరితలంపై పరిశోధనల కోసం వ్యోమగాములు అధిక సమయం అక్కడే ఉండాల్సి వస్తుంది. అలాంటి వారి కోసం త్రీడీ ప్రింటర్ సాయంతో ఇళ్లు నిర్మించాలని యోచిస్తోంది నాసా. చంద్రుడిపై ఉన్న రాక్ చిప్స్, ఖనిజాలను ఉపయోగించి ఇళ్లు నిర్మించడం ద్వారా.. వ్యోమగాములు ఎక్కువ రోజులు అక్కడ ఉండేందుకు వీలుంటుందని భావిస్తోంది.

Also Read: మహాత్మా గాంధీజీకి నోబెల్ శాంతి పురస్కారం ఎందుకు ఇవ్వలేదో తెలుసా? 5 కారణాలు..

ఇందుకోసం కొన్ని ప్రైవేటు కంపెనీలు, యూనివర్సిటీలను భాగస్వాములుగా చేసుకున్న నాసా.. ఆధునిక సాంకేతికత సాయంతో ఈ నిర్మాణాలు చేపట్టనుంది. ఇందుకోసం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 3డీ ప్రింటర్‌ను చంద్రుడి ఉపరితలంపైకి పంపించనున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రుడిపై నిర్మించనున్న త్రీడీ ఇళ్ల నిర్మాణాల కోసం ఏర్పాట్ల బాధ్యతలను పలు కంపెనీలకు అప్పగించింది నాసా.

Also Read: కేవలం 12 రోజుల్లో ఇరాన్ వద్ద అణ్వాయుధాలు.. సంచలన ప్రకటన చేసిన అమెరికా

ఆక్సిజన్‌, ఐరన్, సిలికాన్‌, అల్యూమినియం వెలికితీసి.. సోలార్‌ సెల్స్‌, వైర్లు ఉత్పత్తి చేసే పనులను బ్లూ ఆరిజిన్‌ కంపెనీకి కేటాయించింది. ఇక జాబిల్లిపై రాళ్లు తొలగించడం, వదులుగా ఉండే మట్టిని గట్టిగా చేసి దాన్ని కరిగించి ఘన ఉపరితలంగా మార్చడానికి ఉపయోగించే యంత్రాల అభివృద్ధి బాధ్యతలను రెడ్‌వైర్‌ అనే సంస్థకు అప్పగించింది. ఉష్ణోగ్రతలతో సంబంధం లేకుండా స్థిరంగా కొనసాగే రేడియో ఐసోటోపిక్‌ విద్యుత్‌ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి జెనోపవర్‌ సిస్టమ్స్‌ను ఎంపిక చేశారు.

Also Read: 128 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు అంత్యక్రియలు, ఇప్పటికి చెక్కు చెదరని మృతదేహం

ఈ మిషన్‌ కంటే ముందు నాసా.. ఆర్టెమిస్-2, ఆర్టెమిస్-3 ప్రయోగాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇంతకుముందు చేపట్టిన ఆర్టెమిస్-1 మిషన్ విఫలమైన నేపథ్యంలో.. ఆర్టెమిస్-2 మిషన్‌లో నలుగురు వ్యోమగాముల్ని పంపించేందుకు నాసా రెడీ అవుతోంది. ఇది విజయవంతమైతే.. 2025 లేదా 2026లో ఆర్టెమిస్-3 మిషన్‌ ద్వారా ఒక మహిళతో పాటు నలుగురు వ్యోమగాములతో చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.