NASA : ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌ను కూల్చివేయనున్న అమెరికా .. ప్రపంచానికి ఈ ప్రమాదం తప్పేనా?
అంతరిక్షంలో ఏళ్లుగా సంచరిస్తున్న ఓ భారీ ప్రయోగశాల పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోనుంది. దీన్ని సురక్షితంగా భూమిపై కూల్చేందుకు నాసా ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరో ఎనిమిదేళ్లలో అంటే 2031లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌ను కూల్చివేయనుంది అమెరికా.

International Space Station
NASA : ప్రపంచానికి మరో స్కైలాబ్ ముప్పు పొంచి ఉంది. అంతరిక్షంలో ఏళ్లుగా సంచరిస్తున్న ఓ భారీ ప్రయోగశాల పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోనుంది. దీన్ని సురక్షితంగా భూమిపై కూల్చేందుకు నాసా ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరో ఎనిమిదేళ్లలో అంటే 2031లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌ను కూల్చివేయనుంది అమెరికా. అనేక అంతరిక్ష ప్రయోగాలకు కీలకంగా ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు కాలం తీరింది. ఈ స్పేస్ స్టేషన్ బరువు 400 టన్నులు. ఇది 200 ఏనుగుల కన్నా బరువుంటుంది. మరి టైమ్ అవుట్ అయిన ఇంత భారీ అంతరిక్ష నిర్మాణాన్ని భూమ్మీదకు ఎలా తీసుకొస్తారన్నదే అర్ధం కాని ప్రశ్నగా మారింది.
ఉపగ్రహాలు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోవడమే కాదు..అదే స్థాయిలో నిప్పులు చిమ్ముకుంటూ…భూ వాతావరణంలోకీ ప్రవేశిస్తాయి. 2031లో భారీ ప్రయోగశాల ఇలా నిప్పులు చిమ్ముకుంటూ భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే అసలు సమస్య ఎదురుకానుంది. భూ వాతావరణంలోకి ప్రవేశించినవెంటనే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పేలిపోకుండా చూసి….జాగ్రత్తగా దాన్ని పసిఫిక్ మహాసముద్రంలో ఎంపికచేసిన ప్రాంతంలో పడేలా చేయడమే శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది.
ఈ స్పేస్ స్టేషన్‌ను భూమ్మీదకు తీసుకొచ్చి..సముద్రంలో కూలిపోయేలా చేయడానికి కారణం ఈ స్పేస్ స్టేషన్‌లో ఉన్న హార్డ్‌వేర్ దశాబ్ధాల కిందటిది. దీనివల్ల స్పేస్ స్టేషన్ కక్ష్యలో నియంత్రణ కోల్పోయే ప్రమాదముంది. అందుకే దీన్ని కూల్చివేస్తారు. పసిఫిక్ మహాసముద్రంలో స్పేష్ స్టేషన్ కూలిపోయిన తర్వాత కొన్నివేల కిలోమీటర్ల విస్తీర్ణంలో దాని అవశేషాలు పడతాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను సురక్షితంగా పసిఫిక్ మహాసముద్రంలో కూల్చివేయగలిగితే..అది మరో చరిత్రే అన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ ప్రాజెక్టుకు 8వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా. దీన్ని కూల్చివేయడానికి నిధులు కావాలని అమెరికా కాంగ్రెస్‌ను ఇప్పటికే కోరింది నాసా.
భూ వాతావరణంలోకి ప్రవేశించగానే గతంలో రష్యాకు చెందిన మిర్ అంతరిక్ష కేంద్రం, నాసా ప్రయోగించిన స్కైలాబ్ కాలి బూడిదయ్యాయి. మిర్ అంతరిక్ష కేంద్రంతో పోలిస్తే పరిమాణంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చాలా పెద్దది. మరి అంత పెద్ద నిర్మాణం కాలిబూడిద కాకుండా..ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేకుండా పసిఫిక్ సముద్రంలో పడేలా చేయడానికి శాస్ర్తవేత్తలు సుదీర్ఘంగా శ్రమించాల్సి ఉంటుంది.
అమెరికా, రష్యా తో పాటు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ 12కుపైగా దేశాలు కలిసి నిర్మించాయి. సోవియట్ యూనియన్ పతనం తర్వాత అమెరికా, రష్యా కలిసి పనిచేసిన ప్రాజెక్టు ఇది. 1998లో నిర్మితమైన ఈ స్పేస్ సెంటర్‌ను ఇప్పటిదాకా 20దేశాలకు చెందిన 250మందికి పైగా వ్యోమగాములు సందర్శించారు. ఇంత చరిత్ర కలిగిన ఈ స్పేస్ సెంటర్ కూల్చివేతలో ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.