అంతరిక్ష కేంద్రాన్ని సముద్రంలో ముంచేస్తున్న నాసా? ఎందుకు? ఏమిటి? ఎలా? తెలుసుకోండి..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ను సురక్షితంగా పసిఫిక్ మహాసముద్రంలో కూల్చేయడానికి అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' (NASA) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
NASA preparing to bring the International Space Station down into the Pacific Ocean.
- అంతరిక్ష కేంద్రం కూల్చివేత ఖాయం.
- పసిఫిక్ సముద్రంలో పడేలా ప్లాన్.
- పర్యావరణ వేత్తల తీవ్ర ఆందోళన.
ISS: సుమారు మూడు దశాబ్దాలుగా నింగిలో అలుపెరగకుండా శాస్త్ర పరిశోధనలకు వేదికగా నిలిచిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) త్వరలోనే చరిత్ర పుటల్లో కలవనుంది. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో, 450 టన్నుల బరువుతో పరిభ్రమిస్తోన్న ఈ భారీ నిర్మాణాన్ని సురక్షితంగా పసిఫిక్ మహాసముద్రంలో కూల్చేయడానికి అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ (NASA) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 1998లో రష్యా, అమెరికాలతో పాటు పలు దేశాల భాగస్వామ్యంతో ప్రారంభమైన ఈ అంతరిక్ష కేంద్రం.. నిర్దేశిత 15 ఏళ్ల పరిమితిని దాటి, రెట్టింపు కాలం అద్భుతమైన సేవలను అందించింది. అయితే వయసు పైబడటం వల్ల ఇది ఇకపై సురక్షితం కాదని, మరమ్మతులకు భారీగా ఖర్చవుతుందనే కారణంతో 2030 నాటికి దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని నిర్ణయించారు.
ఉపగ్రహాల శ్మశాన వాటిక ‘పాయింట్ నీమో’:
ఒక ఫుట్బాల్ మైదానమంత పరిమాణం (358 అడుగుల పొడవు, 239 అడుగుల వెడల్పు) ఉండే ఐఎస్ఎస్ను జనావాసాలపై పడకుండా కూల్చడం నాసాకు అతిపెద్ద సవాలు. ఇందుకోసం వారు పసిఫిక్ మహాసముద్రంలోని అత్యంత నిర్మానుష్య ప్రాంతమైన ‘పాయింట్ నీమో’ను ఎంచుకున్నారు. భూమిపై మనుషులు నివసించే ప్రాంతానికి దాదాపు 2,688 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రదేశాన్ని ‘ఉపగ్రహాల శ్మశాన వాటిక’గా పిలుస్తారు. కాలం చెల్లిన ఉపగ్రహాలన్నీ ఇక్కడే కూల్చేస్తారు. 2028 నుంచి ఐఎస్ఎస్ కక్ష్యను క్రమంగా తగ్గించి, 2029లో ‘spaceX’కు చెందిన ప్రత్యేక డీ-ఆర్బిట్ నౌక సహాయంతో, 46 థ్రస్టర్లను ఉపయోగించి నియంత్రిత పద్ధతిలో ఈ పాయింట్ నీమో వైపునకు గమ్యాన్ని మారుస్తారు.
పర్యావరణ వేత్తల తీవ్ర ఆందోళన:
ఈ భారీ కూల్చివేతపై పర్యావరణ శాస్త్రవేత్తలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 450 టన్నుల బరువైన రకరకాల లోహాలు, ప్లాస్టిక్, రసాయన వ్యర్థాలు సముద్రంలో పడటం వల్ల జలచరాల మనుగడకు, పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ‘ద ఓషన్ ఫౌండేషన్’ హెచ్చరిస్తోంది. సముద్రాలను అంతరిక్ష చెత్తకుప్పగా మార్చడం సరికాదని, ఐఎస్ఎస్ను ఒకేసారి కూల్చకుండా దశలవారీగా విడగొట్టి, అవసరమైన భాగాలను అంతరిక్షంలోనే పునర్వినియోగించుకోవాలని వారు సూచిస్తున్నారు. స్పేస్ లయబిలిటీ కన్వెన్షన్-1972 ప్రకారం అంతరిక్ష శకలాల వల్ల భూమిపై నష్టం జరిగితే పరిహారం చెల్లించే నిబంధన ఉన్నా, అది సముద్రాలకు వర్తించకపోవడం గమనార్హం. మానవజాతికి దూరంగా ఉన్నా సముద్ర పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ మేధావులు స్పష్టం చేస్తున్నారు.
