సునీతా విలియమ్స్‌ను తీసుకురావాల్సిన క్రూ-9 మిషన్‌ వాయిదా.. ఎందుకో తెలుసా?

ఈ మిషన్ ద్వారానే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను..

సునీతా విలియమ్స్‌ను తీసుకురావాల్సిన క్రూ-9 మిషన్‌ వాయిదా.. ఎందుకో తెలుసా?

Sunita Williams and Butch Wilmore

Updated On : September 26, 2024 / 12:04 PM IST

NASA Crew-9 mission: క్రూ-9 మిషన్‌ను ఇవాళ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపే ప్రయోగం చేయాలని నాసా, స్పేస్‌ ఎక్స్ భావించగా ఈ ప్రయోగం శనివారానికి వాయిదా పడింది. గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ఫ్లోరిడా పశ్చిమ తీరంలో ఉష్ణమండల తుపాను హెలెన్ కారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ మిషన్‌ను వాయిదా వేశారు.

ఈ మిషన్ ద్వారానే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి భూమి మీదకు తీసుకురానున్నారు. అంతరిక్ష కేంద్రానికి బోయింగ్‌ స్టార్‌లైనర్‌ ద్వారా వెళ్లిన ఆ ఇద్దరు వ్యోమగాములు అందులో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

దీంతో వారిని నాసా, స్పేస్‌ ఎక్స్ కలిసి క్రూ-9 మిషన్‌ ద్వారా తిరిగి భూమి మీదకు తీసుకొచ్చే ప్రణాళికలు వేసుకున్నాయి. సెప్టెంబరు 26న ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉంది. అయితే, హెలెన్ తుపాను గల్ఫ్ ఆఫ్ మెక్సికో గుండా కదులుతున్నప్పటికీ, ఫ్లోరిడాలోని వాయవ్య ప్రాంతంపై ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు.

కేప్ కెనావెరల్ ప్రాంతంలో భారీగా ఈదురుగాలులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి నుంచే ఈ మిషన్‌ను ప్రారంభించాల్సి ఉంది. నాసా, స్పేస్‌ ఎక్స్‌ తో పాటు యూఎస్‌ స్పేస్ ఫోర్స్ 45 వెదర్ స్క్వాడ్రన్ కలిసి ఈ తుపాను పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. క్రూ-9 మిషన్ సంసిద్ధతపై జరిపిన రివ్యూ ఇప్పటికే విజయవంతంగా ముగిసింది.

Earth Second Moon : మన భూమికి ‘మినీ మూన్’.. ఎప్పుడు వస్తుంది? మనం చూడగలమా?