చైనాలో కొత్త రూల్స్ : జిన్​పింగ్​ పార్టీలో అసమ్మతికి నో ప్లేస్

చైనాలో కొత్త రూల్స్ : జిన్​పింగ్​ పార్టీలో అసమ్మతికి నో ప్లేస్

Updated On : January 6, 2021 / 7:28 PM IST

Chinese Communist Party చైనీస్​ కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవానికి సన్నద్ధమవుతోంది. ఈ సమయంలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది. 9.2కోట్ల మంది సభ్యులున్న పార్టీ నిబంధనలకు మార్పులు చేసింది. ఇకపై పార్టీపై క్యాడర్ బహిరంగంగా అసమ్మతి తెలియజేయడాన్ని నిషేధించింది. అయితే, అసమర్థ నాయకలను తప్పించాలని తెలిపే స్వేచ్ఛను మాత్రం పార్టీ కార్యకర్తలకు ఇచ్చింది.

సవరించిన రూల్స్ ప్రకారం…పార్టీ కార్యకర్తలు తమ నాయకుల గురించి ఫిర్యాదులు చేయవచ్చు కానీ బహిరంగంగా మాత్రం చేయకూడదు. అదేవిధంగా పార్టీ కేంద్ర నిర్ణయాలను గానీ, పార్టీపై అసమ్మతిని గానీ బహిరంగంగా వెలిబుచ్చడంపై నిషేధం విధించింది. నిబంధలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. జులైలో కమ్యూనిస్టు పార్టీ ఆప్​ చైనా(సీపీసీ) శత వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీలోని 9.2కోట్ల మంది సభ్యులు ఇక కొత్త నిబంధనలు పాటించనున్నారు.

అయితే, అంతర్గత ఫిర్యాదులను పరిష్కరించడం కోసం నూతన మార్గదర్శకాలను జారీ చేశారు. పార్టీలో అసమర్థ నాయకులు ఉన్నారని భావించే కార్యకర్తలు, వారి ఆరోపణలను రుజువు చేస్తే ఆ నాయకులను పదవి నుంచి తప్పిస్తారు. పార్టీ కార్యకలాపాల్లో చేసే చిన్న చిన్న తప్పులను క్రమ శిక్షణా రాహిత్యం కింద పరిగణించరు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్​ చైనాను 1921లో మవో జెడోంగ్​ స్థాపించారు. 1949లో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఇప్పటివరకు అధికారంలోనే ఇంది. ఒకే పార్టీ రాజకీయ వ్యవస్థను ఇన్నేళ్లపాటు అనుసరించి అరుదైన ఘనత సాధించింది.