ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఫిలిప్పీన్స్ లో కరోనా వైరస్ సోకి ఒకరు మృతి చెందారు.
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. దాదాపు 20 దేశాలకు కరోనా వైరస్ పాకింది. కరోనా దెబ్బకు గజగజ వణికిపోతున్నాయి. చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో మృత్యుఘోష వినిపిస్తోంది. డ్రాగన్ కంట్రీలో 304 మంది చనిపోయారు. తాజాగా ఫిలిప్పీన్స్ లో కరోనా వైరస్ సోకి ఒకరు మృతి చెందారు. కరోనా వైరస్ తో చైనా బయట చనిపోయిన తొలి వ్యక్తిగా గుర్తించారు.
చైనాను కాటేస్తోన్న కరోనా
చైనాను కరోనా కాటేస్తోంది. పడగ విప్పుతూ..ప్రజల ఊపిరి ఆపేస్తోంది. వుహాన్ నగరంలో బయటపడిన ఈ వైరస్ చైనా ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు మృతుల సంఖ్య పెరుగుతోంది. రోజు రోజుకు వైరస్ తీవ్రతరం అవుతోంది. దీనిని అరికట్టాలని చైనా ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ విఫలమౌతున్నాయి.
అంతర్జాతీయ కార్పొరేట్ రంగాన్ని కలవరపెడుతోన్న కరోనా
మరోవైపు అంతర్జాతీయ కార్పొరేట్ రంగాన్ని కరోనా కలవరపెడుతోంది. చైనాలోని తమ కార్యకలాపాలను 2020, ఫిబ్రవి 9వ తేదీ వరకు తాత్కాలికంగా ఉపసంహరించుకోనున్నట్లు కార్పొరేట్ దిగ్గజం ఆపిల్ వెల్లడించింది. ఆపిల్ స్టోరులకు ఉత్పత్తులన్నీ..ఎక్కువగా వుహాన్ నుంచే వస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే..చైనాలో ఉన్న 324 మంది భారతీయులను సురక్షితంగా ఢిల్లీకి తీసుకొచ్చారు. ఎయిరిండియా ప్రత్యేక విమానం 2020, ఫిబ్రవరి 1న శనివారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది.
కరోనా వైరస్ పరీక్షలు
వుహాన్ సహా చైనాలోని వేర్వేరు యూనివర్సిటీల్లో చదువుతున్న 211 మంది విద్యార్థులున్నారు. విమానాశ్రయంలో దిగగానే..ఎయిర్ పోర్టు హెల్త్ అథార్టీ, సైనిక దళాల వైద్య సేవల విభాగం అధికారులు వారందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఢిల్లీకి సమీపంలోని మనేసర్‌లోని క్వారంటైన్‌కు తరలించారు. ప్రత్యేక వసతిలో వీరిని రెండు వారాల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు.