UNICEF : అఫ్ఘాన్‌లో ఒక మిలియన్‌కి పైగా చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని.. వారికి సరైన ఆహారం అందించకపోతే ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉందని యూనిసెఫ్ ప్రతినిధులు తెలిపారు. తాజాగా అఫ్ఘాన్‌లో పర్యటించిన యూనిసెఫ్ బృందం అనేక ఆసుపత్రులను సందర్శించినట్లు తెలిపారు. ఎక్కడ చూసినా పిల్లలు నీటి విరేచనాలతో బాధపడుతున్నారని తెలిపారు. మిలియన్‌కి పైగా చిన్నారులకు సరైన ఆహారం అందటం లేదని వెల్లడించారు.
Read More : అఫ్ఘాన్ లో 13 మంది హజారాలను దారుణంగా హత్యచేసిన తాలిబన్లు
అఫ్ఘాన్‌లో పర్యటించిన వారిలో యునిసెఫ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒమర్ అబ్ది కూడా ఉన్నారు. అక్కడి పరిస్థితులపై మాట్లాడిన అబ్ది సంచలన విషయాలను బయటపెట్టారు. అఫ్ఘాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత అక్కడ ప్రజల పరిస్థితి దారుణంగా తయారైందని తెలిపారు. తమ పిల్లలకు పోష్టికాహారం ఇవ్వాలనుకున్నా అక్కడ దొరకడం లేదని తెలిపారు. నిత్యావసర సరుకుల రేట్లు ఆకాశానికంటాయని వివరించారు.
తాను అఫ్ఘాన్ కీలక వ్యక్తులను కలిసినప్పుడు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, రోగనిరోధక టీకాలు, తాగునీరు, పారిశుధ్యం, పిల్లలకు పౌష్టికాహారం అందించాలని నొక్కి వక్కాణించినట్లు తెలిపారు. తక్షణమే చర్యలు తీసుకోకుంటే 2021లో అఫ్ఘాన్‌లో ఒక మిలియన్ పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతారని, చనిపోవచ్చని అంచనా వేసినట్లు యునిసెఫ్ అధికారులు తెలిపారు. పోలియో, మీజిల్స్, కోవిడ్ -19 టీకాల వితరణ తిరిగి ప్రారంభించాలని కోరిన ఆయన తక్షణ చర్యలు చేపట్టి దేశంలోని చిన్నారులను, ప్రజలను రక్షించాలని కోరినట్లు వివరించారు.
Read More : అప్ఘానిస్తాన్‌లోని ఓ మసీదులో భారీ పేలుడు.. 100 మందికి పైగా మృతి
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే పోలియో వ్యాధి కనిపిస్తోందని, మరే ఇతర దేశాల్లో పోలియో కేసులు నమోదు కావడం లేదని.. దీనిపై కూడా దృష్టి పెట్టాలని తాలిబన్ నేతలను కోరినట్లు ఒమర్ అబ్ది తెలిపారు. covid – 19, పోలియో కాల్ సెంటర్ భాగస్వాములను కలిశానని, ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరినట్లు తెలిపారు. అఫ్ఘాన్ లో స్వేచ్ఛ జీవనం కొరకు యూనిసెఫ్ ఒత్తిడి చేస్తూనే ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను కలిగి ఉన్న అఫ్ఘాన్ ను చూడటమే తమ లక్ష్యమని ఒమర్ అబ్ది పేర్కొన్నారు. అఫ్గానిస్తాన్ పర్యటనలో, అబ్దితో పాటు యునిసెఫ్ రీజనల్ డైరెక్టర్ జార్జ్ లార్య-అడ్జీ, యునిసెఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధి హెర్వ్ లుడోవిక్ డి లైస్ ఉన్నారు.