ఏడాదిగా యుద్ధం.. సైనికుల కొరతతో ఇజ్రాయెల్ అష్టకష్టాలు..!

ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఇజ్రాయెల్ గ్రౌండ్ కార్యకలాపాలను ప్రారంభించింది.

Israel Army (Photo Credit : Google)

Israel Army : సైనికుల కొరతతో ఇజ్రాయెల్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. గాజా యుద్ధంతో ఏడాదికిపైగా అలసిపోయిన ఇజ్రాయెల్ సైన్యం విశ్రాంతిని కోరుకుంటోంది. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. గతేడాది అక్టోబర్ 20న గాజాలో దాడులు ప్రారంభించిన తర్వాత 367 మంది సైనికులను కోల్పోయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఇజ్రాయెల్ గ్రౌండ్ కార్యకలాపాలను ప్రారంభించింది. అప్పటి నుంచి లెబనాన్ లో 37 మంది సైనికులు మరణించారు. దీంతో కొత్త రిక్రూట్ మెంట్ పై ఫోకస్ పెట్టిన ఇజ్రాయెల్ ప్రభుత్వం.. ప్రస్తుతం సైనికులను నియమించుకోవడానికి అష్టకష్టాలు పడుతోంది.

ప్రస్తుతం ఒకే సమయంలో ఇజ్రాయెల్ రెండు ప్రాంతాల్లో యుద్ధం చేస్తోంది. గాజాలో హమాస్ తో, లెబనాన్ లో ఇరాన్ మద్దతున్న మిలిటెంట్ గ్రూప్ హెజ్ బొల్లాతో పోరాడుతున్నారు. యుద్ధంతో అలసిపోయిన కొంతమంది ఇజ్రాయెల్ సైనికులు.. తమకు డ్యూటీ పొడిగించొద్దని, సాధారణ జీవనం సాగించేందుకు అనుమతించాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సైనికుల కనీస వేతనం చెల్లించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ.. తమ కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని, వెంటనే వేతనాలను కూడా పెంచాల్సిందేనన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.

ఓవైపు గాజా, మరోవైపు హెజ్ బొల్లాతో యుద్ధంలో ఇజ్రాయెల్ నిమగ్నం కావడంతో గడువు ముగిసినా.. రిజర్వ్ సేనల సేవలు కొనసాగిస్తున్నారు. ఏడాది నుంచి దాదాపు 3 లక్షల మంది సేవలు వినియోగించుకుంటున్నారు. దాంతో వారంతా అసంతృప్తితో ఉన్నారు.

మరోవైపు లెబనాన్ లోని హెజ్ బొల్లా స్థావరాలపై తీవ్ర స్థాయిలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ విరుచుకుపడుతోంది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు హెజ్ బొల్లా మిలిటెంట్ సంస్థకు చెందిన 80 శాతం రాకెట్స్ ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ అంచనా వేసింది. ఆ ముఠా వద్ద ఇంకా 20 శాతం రాకెట్లు, క్షిపణులు మాత్రమే ఉన్నట్లు ఇజ్రాయెల్ అంచనా వేసింది. ఇక, ఇరాన్ ప్రతిదాడి చేస్తే తమ దెబ్బ ఇంకా గట్టిగా ఉంటుందని ఇజ్రాయెల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

విశ్రాంతి కావాలి..
* ఒకవైపు గాజాలో హమాస్ తో మరోవైపు లెబనాన్ లో హెజ్ బొల్లాతో ఇజ్రాయెల్ యుద్ధం
* ఒకే సమయంలో 2 చోట్ల యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఆర్మీ
* యుద్ధంలో ఇప్పటికే వందల సంఖ్యలో మృతి చెందిన ఇజ్రాయెల్ సైనికులు
* విశ్రాంతి కోరుకుంటున్న సైనికులు
* తమ విధులను పొడిగించవద్దని సైనికుల విన్నపం
* సైనికుల కొరతతో ఇజ్రాయెల్ ఇబ్బందులు
* కొత్త రిక్రూట్ మెంట్ ను ప్రారంభించిన ఇజ్రాయెల్
* విధుల్లో చేరేందుకు ఇష్టపడని ఇజ్రాయెల్ యువత
* సైనికుల నియామకంలో అష్టకష్టాలు పడుతున్న ఇజ్రాయెల్

 

Also Read : ఉత్తర కొరియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా.. కిమ్ ఏమన్నాడంటే?