India Pakistan: భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. టెన్షన్‌లో పాకిస్థాన్.. మరో 36గంటల్లో దాడిచేయొచ్చంటూ పాక్ మంత్రి ఆందోళన

పాకిస్థాన్ సమాచార మంత్రి అత్తతుల్లా తరార్ మాట్లాడుతూ.. భారత సైన్యం పాకిస్థాన్ పై దాడి చేయబోతుందని ..

Attaullah Tarar

India Pakistan: ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి కారణంగా 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడి వెనక పాకిస్థాన్ హస్తం ఉందని స్పష్టమైన ఆధారాలు లభించాయని నిఘా వర్గాలు బయటపెట్టాయి. దీంతో భారత ప్రభుత్వం పాకిస్థాన్ కు గుణపాఠం చెప్పేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు ఇండియా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రతీకార దాడికి భారత్ సిద్ధమవుతోందని పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది. ఇదే విషయంపై తాజాగా పాకిస్థాన్ మంత్రి భయాందోళన వ్యక్తం చేశారు.

Also Read: Indo-Pak Tensions: పాకిస్తాన్‌కు భారత్ మరో బిగ్ షాక్..! పాక్ ఎయిర్‌లైన్స్‌కు గగనతలం మూసివేత?

పాకిస్థాన్ సమాచార మంత్రి అత్తతుల్లా తరార్ మాట్లాడుతూ.. భారత సైన్యం పాకిస్థాన్ పై దాడి చేయబోతుందని పేర్కొన్నారు. విశ్వసనీయమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని.. రాబోయే 24-36 గంటల్లో పాకిస్థాన్ పై భారత సైన్యం విరుచుకుపడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పహల్గాం ఘటనలో పాకిస్థాన్ ప్రమేయం ఉందని భారత ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేస్తోందని, సైనిక దురాక్రమణ చర్యలకు పాల్పడేందుకే ఈ వాదనలు చేస్తోందని అత్తుతుల్లా తరార్ ఆరోపించారు. పాకిస్థాన్ కూడా ఉగ్రవాద బాధిత దేశమేనని, భారత్ చేస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నామని అన్నారు. ఒకవేళ తమ దేశంపై సైనిక చర్యలకు భారతదేశం దిగితే తీవ్రపరిణామాలు ఉంటాయని మంత్రి తరార్ హెచ్చరించారు.

పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ – పాకిస్థాన్ సరిహద్దుల్లో అలజడి కొనసాగుతోంది. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది. తాజాగా.. బుధవారం ఉదయం ఎల్వోసీతోపాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ సైన్యం ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్ లోని పలు సెక్టార్లలో భారత సైన్యంపైకి కాల్పులకు తెగబడింది. పాక్ సైన్యం చర్యలను భారత్ బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి.