Indo-Pak Tensions: పాకిస్తాన్‌కు భారత్ మరో బిగ్ షాక్..! పాక్ ఎయిర్‌లైన్స్‌కు గగనతలం మూసివేత?
ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ ఎయిర్ లైన్లకు ఇది మరింత శరాఘాతంగా మారనుంది.

Indo Pak Tensions: సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు భారత్ మరో బిగ్ షాక్ ఇవ్వనుంది. దాయాది దేశానికి చెందిన ఎయిర్ లైన్స్ కు గగనతలాన్ని మూసివేసే దిశగా కేంద్రం ఆలోచనలు చేస్తోంది. అటు పాక్ నౌకలు భారత ఓడరేవులకు రాకుండా నిషేధం విధించినట్లు తెలుస్తోంది. తమ గగనతలంపై భారత విమానాల రాకపోకలపై నిషేధం విధించిన పాక్ పై ప్రతీకార చర్యలకు భారత్ సిద్ధమవుతోంది.
పాక్ విమానయాన సంస్థలకు భారత గగనతలాన్ని మూసివేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలన దశలో ఉందని, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఒకవేళ దీనిపై భారత్ నిర్ణయం తీసుకుంటే అది పాక్ ఎయిర్ లైన్స్ పై పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది.
Also Read: పాకిస్థాన్ ఆర్మీలో భయమా? తిరుగుబాటా?.. సంచలనం సృష్టిస్తున్న లేఖలు.. వైరల్
పాక్ విమానాలు కౌలాలంపూర్ సహా మలేషియాలోని ఇతర నగరాలు సింగపూర్, థాయ్ ల్యాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే మన గగనతలాన్ని దాటాల్సిందే. ఇప్పుడు భారత్ నిషేధం విధిస్తే దక్షిణాసియా ప్రాంతాలకు వెళ్లేందుకు చైనా లేదా శ్రీలంక మీదుగా విమానాలను మళ్లించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రయాణ సమయం పెరగడంతో పాటు నిర్వహణపైనా అదనపు భారం పడుతుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ ఎయిర్ లైన్లకు ఇది మరింత శరాఘాతంగా మారనుంది.
పహల్గామ్ ఉగ్రదాడితో యావత్ భారతం రగిలిపోతోంది. పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోర్డర్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ పై అనేక ఆంక్షలు విధించింది భారత్. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదిని అష్టదిగ్బంధం చేసే యోచనలో భారత్ ఉంది. ఆ దిశగా పాక్ పై మరిన్ని ఆంక్షలు విధించేందుకు రెడీ అవుతోంది. పాక్ ను అష్టదిగ్బంధం చేసేలా.. అన్ని చర్యలను భారత్ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here