Pakistan Fuel Prices Hike
Pakistan Fuel Prices Hike : పాకిస్థాన్ లో ఇంధన ధరలు పీక్స్ చేరుకున్నాయి. పాకిస్థాన్ దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.300లు దాటాయి. ఈ ధరాఘాతాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓ పక్క నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. విద్యుత్ చార్జీల ధరలు పెంచేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో పెట్రోలు, డీజిల్ ధరలు రూ.300లు దాటి పోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధన ధరలు ఈ రేంజ్ లో ఉంటే నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ లో ఈ ఇంధన ధరలు మరింత భారంగా మారాయి.
విద్యుత్ చార్జీల భారంతో ఇప్పటికే అల్లాడుతున్న పాక్ ప్రజలను ఇంధన ధరలు కూడా పట్టి పీడిస్తున్నాయి. పాక్ చరిత్రలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.300 మార్కును దాటాయి. ప్రధాని అన్వరుల్ హక్ కకర్ నేతృత్వంలోని ప్రభుత్వం గురువారం (ఆగస్టు 31,2023) పెట్రోల్ ధర లీటరుకు రూ.14.91, డీజిల్ ధర రూ.18.44 మేర పెంచింది. దీంతో, లీటరు పెట్రోల్ ధర రూ.305.36కు చేరుకోగా, డీజిల్ ధర రూ.311.84ను తాకింది.
ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ లో ఒక సంక్షోభం నుండి మరొక సంక్షోభానికి దారితీస్తున్నట్లుగా ఉంది పరిస్థితి. ఆర్థిక మంత్రిత్వ శాఖ నిన్న సాయంత్రం పెట్రోల్ ధర రూ.14.91, హై-స్పీడ్ డీజిల్ (HSD) ధర రూ. 18.44 పెంచినట్లు ప్రకటించింది. ప్రస్తుతం పెట్రోల్ ధర రూ. 305.36 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ. 311.84 కి చేరుకుంది.
కొన్ని దశాబ్దాలుగా చూసుకుంటే పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవల ఆర్థిక సంస్కరణలు చారిత్రాత్మక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లకు దారి తీశాయి. సాధారణ ప్రజలతో పాటు వ్యాపారులపై కూడా తీవ్ర ఒత్తిడికి కారణమయ్యాయి. పాకిస్థాన్ రూపాయి విలువ నిరంతర తగ్గిపోతుండటంతో సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచాల్సి వచ్చింది. గత మంగళవారం ముగింపు 304.4తో పోలిస్తే పాక్ కరెన్సీ యూఎస్ డాలర్ కు రికార్డు స్థాయిలో 305.6కు ట్రేడ్ అవుతోంది. ఇలా పాక్ రూపాయి విలువ తగ్గిపోతుండటంతో ఇంధన ధరలు పెంపుకు కారణమవుతోంది. ఈ ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడుతోంది.