Pakistan
Pakistan Political Crisis : పాకిస్థాన్ లో రాజకీయ అనిశ్చితి కంటిన్యూ అవుతోంది. జాతీయ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై 2022, ఏప్రిల్ 09వ తేదీ శనివారం జాతీయ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. పాక్ కాలమాన ప్రకారం 10.30 గంటలకు సభ ప్రారంభం కాగానే… అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీనిని అధికారపక్షం వ్యతిరేకించింది. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సభలో పరిస్థితి మారకపోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
Read More : Pakistan politics: నేడు ఇమ్రాన్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం.. ఓటింగ్ ఎలా జరుగుతుందంటే..
ఓటింగ్ కు ప్రతిపక్షాలన్నీ హాజరు కాగా.. అధికార పార్టీ నుంచి చాలా మంది నేతలు హాజరు కాకపోవడం గమనార్హం. ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా గైర్హాజర్ అయ్యారు. పీటీఐ నుంచి 51 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ… సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ పాటిస్తారని ఆశిస్తున్నట్లు, ఓటింగ్ నిర్వహించాలని కోరుతున్నామన్నారు. పాక్ సర్కార్ ను కూల్చేందుకు విదేశీ కుట్ర జరుగుతుందన్న ఆరోపణలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.
Read More : Pakistan : ఇమ్రాన్ ఖాన్ భావోద్వేగ ప్రసంగం.. భారత్‌ను ఏ సూపర్ పవర్ శాసించలేదు
విదేశీ కుట్రపై దర్యాప్తు చేయాలని పాక్ విదేశాంగ మంత్రి, పీటీఐ నేత షా మహ్మద్ ఖురేషీ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో.. సభలో వాగ్వాదం నెలకొంది. స్పీకర్ ఎంత వారించినా సభ్యులు వినిపించుకోలేదు. దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులుండగా.. అవిశ్వాసంపై ప్రతిపక్షాలు నెగ్గాలంటే.. 172 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. జాతీయ అసెంబ్లీలో అధికార పార్టీ బలం 164గా ఉంటే.. విపక్షాల సంఖ్యా బలం 177గా ఉంది. దీంతో ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాసం నుంచి గట్టెక్కే అవకాశాలు లేవని స్పష్టంగా కనిపిస్తోంది. కానీ.. ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి.