Mutiny in Russia: పుతిన్ ఎక్కడ? రహస్య ప్రదేశం నుంచి మరో వీడియో విడుదల చేసిన రష్యా అధ్యక్షుడు.. కానీ..

రష్యాలో కలకలం చెలరేగినప్పుడు పెద్ద ఎత్తున పుతిన్, వాగ్నెర్ ప్రైవేట్ మిలిటరీ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ నుంచి సవాళ్లు, ప్రతిసవాళ్లు వచ్చాయి. ఇంతలోనే ఇప్పుడు మాత్రం అంతా సైలెంట్..

Mutiny in Russia: పుతిన్ ఎక్కడ? రహస్య ప్రదేశం నుంచి మరో వీడియో విడుదల చేసిన రష్యా అధ్యక్షుడు.. కానీ..

Vladimir Putin

Mutiny in Russia – Vladimir Putin: యుక్రెయిన్‌(Ukraine)తో యుద్ధం చేస్తున్న వేళ రష్యాలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు సంచలనంగా మారాయి. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కనపడకుండా పోయారు. ఆయన ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్న విషయాలు ఏవీ ప్రజలకు తెలియడం లేదు.

రష్యా పారామిలటరీ సంస్థ, ప్రైవేట్ మిలటరీ కంపెనీ (PMC) వాగ్నెర్ ప్రైవేట్ మిలిటరీ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ (62) తిరుగుబాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రోస్తోవ్‌ ను యెవ్జెనీ ప్రిగోజిన్ తన ప్రైవేటు సేనలతో ఆక్రమించిన అనంతరం మాస్కో వైపుగా దూసుకెళ్లి దానిపై కూడా దాడి చేస్తారని అందరూ భావించారు.

బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెన్కో మధ్యవర్తిత్వం చేయడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రభుత్వానికి, యెవ్జెనీ ప్రిగోజిన్ కి మధ్య ఒప్పందం జరిగింది. దీని ప్రకారం యెవ్జెనీ ప్రిగోజిన్ పై పెట్టిన రాజద్రోహం కేసు ఎత్తివేత, ఆయన సైనికులను ఏమీ చేయబోమని రష్యా ప్రభుత్వం చెప్పడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

రహస్య ప్రదేశం నుంచి పుతిన్ తాజా వీడియో..
పుతిన్ ఈ నెల 24న ప్రిగోజిన్ కు హెచ్చరిక చేస్తూ ప్రకటన చేశారు. రష్యా ఆర్మీపై తిరుగుబాటు చేసిన వారిని వదలబోమని చెప్పారు. అప్పుడు కనపడిన పుతిన్ మళ్లీ ఇప్పటివరకు ప్రజలకు కనపడడలేదు. ఆయన రహస్య ప్రదేశంలో ఉంటున్నారా? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

ఈ సమయంలో మళ్లీ ఇవాళ క్రెమ్లిన్ వెబ్ సైట్ ద్వారా పుతిన్ స్వయంగా వీడియో రూపంలో మాట్లాడారు. పారిశ్రామిక ఫోరానికి చెందిన వారికి అభినందనలు తెలుపుతూ ఈ ప్రకటన ఉంది. ఈ యూత్ ఫోరం సభ్యులను దేశాన్ని నడిపించే ఇంజనీర్లుగా పుతిన్ అభివర్ణించారు. రష్యా ఆర్థిక రంగానికి ఎన్నో సేవలు అందిస్తున్నారని చెప్పారు.

దేశ పారిశ్రామిక రంగంలో స్థిరత్వం కొనసాగడానికి ఆయా కంపెనీలు అద్భుతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రిగోజిన్ గురించిగానీ, ఉక్రెయిన్ తో యుద్ధం గురించి గానీ ఆయన ఏమీ మాట్లాడలేదు. ఇందులో అతి ముఖ్య విషయం ఏమిటంటే పుతిన్ ఏ ప్రదేశం నుంచి ఆ వీడియో సందేశాన్ని రికార్డు చేశారన్న విషయాన్ని క్రెమ్లిన్ తెలపలేదు. ఆయన ఎక్కడ ఉన్నారన్న విషయంపై మౌనం వహిస్తోంది. పుతిన్ కనపడకుండా పోయారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పుతిన్ కు సంబంధించిన ఇటువంటి వీడియో విడుదల కావడం గమనార్హం.

ప్రిగోజిన్ ను విచారించడంపై వెనక్కి తగ్గని రష్యా?
తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్ ను విచారించబోమని, ఆయనపై రాజద్రోహం కేసును ఎత్తి వేస్తామని రష్యా చెప్పిన విషయం తెలిసిందే. నేరపూరిత కేసులను ఎత్తివేస్తారని, ఇక విచారణ ఉండదని, పూర్వ పరిస్థితులు నెలకొంటాయని అందరూ భావించారు. అయితే, రష్యా మీడియా ఇవాళ కీలక విషయాన్ని తెలిపింది. ప్రిగోజిన్ పై విచారణ జరుగుతూనే ఉందని పేర్కొంది.

Mutiny in Russia: అప్పట్లో ఓ ఖైదీ.. ఇప్పుడు సొంత దేశ అధ్యక్షుడినే వణికిస్తున్న ప్రిగోజిన్.. ఇంత ధైర్యం ఎక్కడిది?