Russia Ukraine War: యుక్రెయిన్‌ దారులన్నీ క్లోజ్.. చుట్టుముట్టేస్తున్న రష్యన్ ఆర్మీ..!

యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. 12వ రోజుకు చేరింది. ఆధిపత్యం కోసం రష్యా.. ఆత్మ రక్షణ కోసం యుక్రెయిన్ పోరాటాన్ని భీకరంగా కొనసాగిస్తున్నాయి.

Russia Ukraine War: యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. 12వ రోజుకు చేరింది. ఆధిపత్యం కోసం రష్యా.. ఆత్మ రక్షణ కోసం యుక్రెయిన్ పోరాటాన్ని భీకరంగా కొనసాగిస్తున్నాయి. అంతు చూసే దాకా వదిలేదే లేదన్నట్టుగా బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా.. దాడులను మరింత తీవ్రం చేసింది. యుక్రెయిన్ కు వెళ్లే దారులన్నీ మూత పడేలా బాంబుల మోత మోగిస్తోంది. ఇప్పటికే కీలక నగరాలు, నౌకాశ్రయాలు స్వాధీనం చేసుకునే దిశగా కదులుతున్న రష్యా బలగాలు.. యుక్రెయిన్ దారులను మూసేస్తే ఆ దేశంపై మరింత పట్టు సాధించవచ్చన్నట్టుగా దాడులను తీవ్రతరం చేస్తున్నాయి.

మరియుపోల్, వోల్నోవాఖ నగరాలపై.. రష్యా బలగాలు క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతున్నాయి. దీంతో.. ఆయా ప్రాంతాల్లో స్థానికులతో పాటు.. ఇతర దేశాల ప్రజల తరలింపు ప్రక్రియ నిలిచిపోతోంది. రాత్రి వేళల్లోనూ రష్యా దాడులు కొనసాగుతున్న పరిస్థితుల్లో.. బయటికి వెళ్తే ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో అని.. అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. ఖార్కివ్ లోని అణు రియాక్టర్, అణు ఇంధన సంస్థపైనా రష్యా రాకెట్ల దాడి కొనసాగుతోంది. ఖార్కివ్, మోకలోవ్, చెర్నిహోవ్ నగరాలను రష్యా ఆర్మీ చుట్టుముట్టేసింది.

Read More: Russia – Ukraine War: చివరి దశకు ఆపరేషన్ గంగ.. హంగేరీలోని భారత ఎంబసీ కీలక ప్రకటన

ఇలాంటి తరుణంలోనూ.. యుక్రెయిన్ పౌరుల పోరాటం.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. ఆ దేశ ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో.. యుక్రెయిన్లు పెద్ద సంఖ్యలో తమ దేశం కోసం ఆర్మీలో చేరుతున్నారు. ఆయుధాలు చేత పడుతున్నారు. యుద్ధంలో తామూ భాగమవుతున్నారు. ఆర్మీతో కలిసి రష్యా బలగాలపై అలుపు లేకుండా పోరాటాన్ని చేస్తున్నారు. రష్యాకు సరికొత్త సవాళ్లు విసురడంలో విజయవంతం అవుతున్నారు. అధ్యక్షుడు జెలెన్ స్కీ సైతం.. తాను దేశాన్ని విడిచి వెళ్లేది లేదని చెబుతున్నారు. ఓ వీడియోను విడుదల చేసిన ఆయన.. ఇదే తన ఆఖరి సందేశం కూడా కావచ్చని.. ఇకపై ఎవరూ తనను చూడలేరేమో అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. జెలెన్ స్కీని పోలెండ్ తరలించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలు కూడా వచ్చాయి.

Read More: Putin War : అప్పటివరకు యుక్రెయిన్‌పై యుద్ధం ఆగదు.. తేల్చి చెప్పిన పుతిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలు కూడా.. సంచలనం సృష్టిస్తున్నాయి. తాను అనుకున్నట్టే యుద్ధం జరుగుతోందని గతంలోనే చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆయన.. యుద్ధం ఆపేది లేదని.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాకే యుద్ధం ఆగుతుందని స్పష్టంగా చెప్పేశారు. ఈ లెక్కన.. యుక్రెయిన్ పూర్తిగా రష్యా చేతుల్లోకి వచ్చే వరకూ కాల్పులు ఆపేది లేదని అర్థమవుతోంది. కాల్పుల విరమణ ప్రకటన కూడా అమల్లోకి సరిగా రాని పరిస్థితులు యుక్రెయిన్ లో కనిపిస్తున్నాయి. ఈ విషయంలో.. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరినొకరు తప్పుబడుతున్నాయి. దీన్నిబట్టి.. ఇవాళ కూడా యుద్ధ వాతావరణం శాంతించే పరిస్థితైతే కనిపించడం లేదు.

Read More: Russia Ukraine War: యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాట్లాడనున్న ప్రధాని మోదీ..?

ట్రెండింగ్ వార్తలు