Russian Ukraine War Concern Grows Over Traffickers Targeting Vulnerable Ukrainian Refugees
Russian Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండు వారాలకు పైగా ఇరుదేశాల మధ్య పరస్పరం దాడులు జరుగుతున్నాయి. రష్యా దాడులతో దేశాన్ని వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న యుక్రెయిన్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆదరిస్తున్నారనుకున్న వారే కాటేస్తున్నారు. వెలుగునిస్తారనుకున్న వారే చీకట్లు నింపుతున్నారు. యుద్ధాన్ని తప్పించుకొని వస్తే.. మానాన్ని కాజేస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేశం కాని దేశం వెళ్తే.. సర్వం దోచుకొని జీవచ్ఛవంలా మారుస్తున్నారు. ఇదీ దేశ సరిహద్దులు దాటి వెళ్లిన యుక్రెయిన్ మహిళల పరిస్థితి. శరణార్థులుగా పొరుగు దేశాలకు వెళ్లిన యుక్రెయిన్ మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. దేశం కాని దేశం.. కొత్త ప్రదేశం. భాష తెలియదు. ఏంచేయాలో అసలే తెలియదు. భవిష్యత్తును వెతుక్కుంటూ వస్తే.. మృగాళ్ల వలలో పడుతున్నారు. సాయం చేస్తున్నారని నమ్మితే.. మోసపోతున్నారు. ఇదీ యుక్రెయిన్ మహిళల పరిస్థితి. యుద్ధం తప్పించుకొని పక్క దేశాలకు వలస వెళ్తే.. మానాన్ని పోగొట్టుకొని.. జీవచ్ఛవంలా మారుతున్నారు.
19ఏళ్ల బాలికపై 49ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి :
రష్యా సైనిక చర్యతో యుక్రెయిన్ నుంచి చాలామంది పోలండ్, రొమేనియా, హంగెరీ, మాల్లోవా, స్లావేకియా తదితర దేశాలకు వెళ్లారు. అక్కడి వ్యక్తులు, వాలంటీర్లు వారికి ఆహారం, రవాణా, వసతి సదుపాయాలు కల్పిస్తూ.. ఉపాధి అవకాశాలు పొందడానికి సాయపడుతున్నారు. కానీ, వీరిలో కొందరి ఉద్దేశాలు వేరు. మహిళలను లక్ష్యంగా చేసుకుని లైంగిక దాడులు జరుపుతున్నట్టు వెలుగులోకి రావడంతో ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పోలండ్‌కు వచ్చిన 19 ఏళ్ల బాలికను స్థానికుడైన 49 ఏళ్ల వ్యక్తి ఆశ్రయం కల్పిస్తానని నమ్మబలికి లొంగదీసుకున్నాడు. అనుమానంతో పోలీసులు, అతడిని అదుపులోకి తీసుకోగా.. నేరం ఒప్పుకున్నాడు. ఉపాధి కల్పిస్తామంటూ 16 ఏళ్ల బాలికను మరో వ్యక్తి మభ్యపెట్టాడు. మెడికా సరిహద్దులో ఓ వ్యక్తి, కేవలం మహిళలకు, పిల్లలకు మాత్రమే ఆశ్రయం కల్పిస్తుండడం తాజాగా వెలుగుచూసింది. ఇలా వరుస ఘటనలతో వలస వచ్చిన వారి భద్రత, ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Russian Ukraine War Concern Grows Over Traffickers Targeting Vulnerable Ukrainian Refugees
శరణార్థుల చేతిలో చిల్లిగవ్వ ఉండదు. తక్షణ సాయం కోసం ఎవరో ఒకరిపై ఆధారపడాలి. బతకడం కోసం ఏదన్నా చేయక తప్పని పరిస్థితులు ఉంటాయి. వారి బలహీనతలను వంకర బుద్ధితో సొమ్ము చేసుకునేవారు.. లైంగిక దోపిడీకి పాల్పడేవారు.. వారిని ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించేవారు ఉంటారు. చాలామంది వాలంటీర్లు బాలికలు, మహిళలను తమ ఇళ్లలోకి ఆహ్వానించి దాడి చేస్తుండడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో అలెర్టయిన ఆయా దేశాల పోలీసులు.. యుక్రెయిన్, రష్యన్ బాషల్లో శరణార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆశ్రయం ఇస్తామని చెప్తే నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిని పట్టుకునేందుకు పోలండ్, రొమేనియా పోలీసులు సాధారణ పౌరుల్లాగా తిరుగుతూ నిఘా పెట్టారు.