Scientists Discover Dark Oxygen
Dark Oxygen : ఆక్సిజన్ ఎలా పుడుతుంది.. చెట్ల నుంచే కదా అంటారా? సాధారణంగా చెట్లు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. సూర్యరశ్మి లేకుండా ఆక్సిజన్ ఉత్పత్తి కాదు. ఆక్సిజన్ లేని చోట జీవుల మనుగడ అసాధ్యమే.. కానీ, సముద్రం వేల అడుగుల లోతుల్లో ఇప్పుడు గాలి బుడగులతో కూడిన ఆక్సిజన్ పుట్టుకొస్తోంది. సూర్య కాంతి పడని చోట ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందనే విషయాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు కనుగొన్నారు. దీనికి ‘డార్క్ ఆక్సిజన్’ అని పేరు పెట్టారు. వాస్తవానికి, నీటిలో ఆక్సిజన్ ఉండదని అంటారు..
అలాంటిది సముద్రపు లోతుల్లో కాంతి పడని చోట ఆక్సిజన్ ఉత్పత్పి కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారింది. భూమిపై జీవించే ప్రాణుల పుట్టుకకు సంబంధించి కూడా కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.
దశాబ్దాలుగా అనేక మంది శాస్త్రవేత్తలు డార్క్ ఆక్సిజన్ గురించి అనేక సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ఇప్పటికీ దీనిగురించి తీవ్రంగా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు సముద్ర లోతుల్లో డార్క్ ఆక్సిజన్ ఉందని గుర్తించడంతో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మన వాతావరణంలో జీవులకు ప్రాణదారమైన వాయువులలో ఆక్సిజన్ ఒకటి. మన శ్వాస కూడా ఈ ఆక్సిజన్‌పైనే ఆధారపడి ఉంటుంది. భూమి వాతావరణంలో ఆక్సిజన్ ఉంటుందని అందరికి తెలిసిందే. కానీ, సముద్రం లోతుల్లో కూడా ఆక్సిజన్ ఉంటుందని ఇప్పుడు సైంటిస్టులు తేల్చేశారు. సముద్రం లోపల ఆక్సిజన్ ఎలా ఉత్పత్తి అవుతుంది. అది కూడా సూర్యకాంతి లేని చోట ఇదేలా సాధ్యం అనేది అందరిని ఆశ్యర్యానికి గురిచేస్తోంది.
మైనింగ్ కంపెనీలకు వరమే :
సైంటిస్టుల ఆవిష్కరణ ప్రకారం.. సముద్రపు లోతుల్లో సూర్యరశ్మి పడని చోట ఆక్సిజన్ తయారవుతోంది. ముద్దగా ఉండే లోహ శిలలు ఉన్న చోట ఈ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని కనుగొన్నారు. చీకటిలో ఆక్సిజన్ ఉండటంతో సైంటిస్టులు డార్క్ ఆక్సిజన్‌గా పిలుస్తున్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని అంగీకరిస్తుండగా.. మరికొందరు శాస్త్రవేత్తలు సవాలు చేస్తున్నారు.
గత జూలైలో నేచర్ జియోసైన్స్ జర్నల్‌లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. భూమిపై జీవం మూలాల గురించి ఎంతో కాలంగా ఉన్న నమ్మకాలను ప్రశ్నించేలా అద్భుతమైన ఆవిష్కరణ ఇది. ఈ ఆవిష్కరణ శాస్త్రవేత్తలకు మాత్రమే ముఖ్యమైనది కాదు. ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్‌లో దాగి ఉన్న విలువైన లోహాలను వెలికితీసేందుకు ఆసక్తి చూపే మైనింగ్ కంపెనీలకు డార్క్ ఆక్సిజన్ ఒక వరమని చెప్పవచ్చు.
సముద్రపు లోతుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ఎలా సాధ్యం? :
బంగాళాదుంప పరిమాణంలోని వస్తువులు సముద్రపు నీటిని హైడ్రోజన్ ఆక్సిజన్‌గా మార్చేందుకు తగినంత విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేయగలవని పరిశోధకులు అంటున్నారు. ఈ ప్రక్రియను విద్యుద్విశ్లేషణ అంటారు. ఈ ఆవిష్కరణ అనేక సందేహాలకు దారితీస్తోంది. ఇప్పటివరకు, జీవులు సూర్యరశ్మి అవసరమయ్యే కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయని అందరూ నమ్ముతారు.
కానీ, ఇప్పుడు కొత్త ఆవిష్కరణతో పర్యావరణవేత్తలు సైతం డార్క్ ఆక్సిజన్ ఉనికి, సముద్రపు లోతుల్లో లైఫ్ గురించి చాలా తక్కువే మనకు తెలుసునని అభిప్రాయపడుతున్నారు. దాదాపు 2.7 బిలియన్ సంవత్సరాల క్రితం సూర్యరశ్మి అవసరమయ్యే కిరణజన్య సంయోగక్రియ ద్వారా జీవులు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడం వల్లనే లైఫ్ సాధ్యమని అందరూ నమ్ముతున్నారు
సముద్ర మైనింగ్ నిలిపివేయాలి :
పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర మైనింగ్‌ను నిలిపివేయాలని చాలా కాలంగా గ్రీన్‌పీస్ సంస్థ ప్రచారం చేస్తోంది. ఎందుకంటే.. ఇది సున్నితమైన లోతైన సముద్ర పర్యావరణ వ్యవస్థకు హాని కలిగించవచ్చునని పర్యావరణ సంస్థ గ్రీన్‌పీస్ తెలిపింది. ఈ కొత్త ఆవిష్కరణ క్లారియన్-క్లిప్పర్టన్ జోన్‌లో జరిగింది. ఈ జోన్ మెక్సికో, హవాయి మధ్య పసిఫిక్ మహాసముద్రం నీటి అడుగున ప్రాంతం. దాంతో ఇప్పుడు, మైనింగ్ కంపెనీల ఆసక్తి పెరుగుతోంది.
సముద్రంలో పాలీమెటాలిక్ నోడ్యూల్స్ :
సముద్ర ఉపరితలం నుంచి 2.5 కిలోమీటర్ల దిగువన ఉన్న ప్రాంతం. పాలీమెటాలిక్ నోడ్యూల్స్ సముద్రం లోతుల్లో ఉంటాయి. వీటిలో మాంగనీస్, నికెల్ మరియు కోబాల్ట్, అనేక ఇతర లోహాలు ఉన్నాయి. సాధారణంగా, ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీలలో ఉపయోగించే మాంగనీస్, నికెల్, కోబాల్ట్, అనేక ఇతర లోహాలను కలిగిన పాలీమెటాలిక్ నోడ్యూల్స్ సముద్రంలో ఉన్నాయి.
వీటిని ఇతర లో-కార్బన్ టెక్నాలజీలలో కూడా ఉపయోగిస్తారు. అయితే, ఈ ఆవిష్కరణపై శాస్త్రవేత్తల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సముద్రగర్భంలోని కాంతిలేని అగాధంలో ఆక్సిజన్ ఎలా ఉత్పత్తి అవుతుందనే వాదనను కూడా వినిపిస్తున్నారు. అంతేకాదు.. సముద్రంలో మైనింగ్ అక్కడి పర్యావరణ వ్యవస్థకు ఎంత హానికరమో పర్యావరణ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.