Somalia Bomb Explosions : భారీ బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా.. 100మంది మృతి

సోమాలియా బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. రాజధాని మొగదిషులో రెండు శక్తిమంతమైన కారుబాంబు పేలుళ్ల సంభవించాయి. ఈ ఘటనలో 100 మంది మరణించారు.

Somalia Bomb Explosions : సోమాలియా బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. రాజధాని మొగదిషులో రెండు శక్తిమంతమైన కారుబాంబు పేలుళ్ల సంభవించాయి. ఈ ఘటనలో 100 మంది మరణించారు. మరో 300 మందికిపైగా గాయపడ్డారు. స్థానికంగా రద్దీగా ఉండే జోబ్‌ కూడలి సమీపంలోని విద్యాశాఖ కార్యాలయం వెలుపల ఈ ఘటన జరిగింది. విద్యాశాఖ కార్యాలయం టార్గెట్ గా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

మొదటి పేలుడు సంభవించిన తర్వాత గాయపడిన వారికి సాయం అందించేందుకు అంబులెన్సులు, పెద్దఎత్తున జనాలు చేరుకున్న సమయంలోనే రెండో పేలుడు చోటుచేసుకుంది. పేలుళ్ల ధాటికి చుట్టుపక్కల ఉన్న భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. ఎక్కడికక్కడ మృతదేహాలతో పరిసరాలు భీతావహంగా మారాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ ఘటనపై దేశాధ్యక్షుడు హసన్‌ షేక్‌ మొహమూద్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని తెలిపారు. గాయపడిన వారికి అత్యవసర వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఇది అల్‌ ఖైదాతో సంబంధాలు ఉన్న ఉగ్రసంస్థ ‘అల్‌ షబాబ్‌’ పనేనంటూ అధ్యక్షుడు ఆరోపించారు.

ఈ సంస్థ కార్యకలాపాలను నియంత్రించడంపై అధ్యక్షుడు, ప్రధాని, ఇతర సీనియర్‌ అధికారులు సమావేశమైన రోజే ఈ దాడి సంభవించడం గమనార్హం. కాగా, ఐదేళ్ల క్రితం సైతం సరిగ్గా ఇదే(జోబ్) జంక్షన్ దగ్గర సంభవించిన పేలుడు ఘటనలో 500 మందికిపైగా మరణించారు. ఆ పేలుళ్లకు అల్-షబాబ్ కారణమని తేలింది. ఉగ్రసంస్థ అల్ షబాబ్ తరచుగా హై-ప్రొఫైల్ ప్రదేశాలపై దాడులు చేస్తోంది. రాజధానిని లక్ష్యంగా చేసుకుని ఈసారి పేలుళ్లకు కుట్రపన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు